విశ్వవిఖ్యాత నట సౌర్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తానని ప్రకటించారు ఆయన తనయుడు, హీరో, అనంతపురం జిల్లా హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను త్వరలోనే సినిమా తెరకెక్కిస్తామని, ఎన్టీఆర్ పాత్రలో తానే నటిస్తానని, సినిమా స్క్రిప్ట్ పై పరిశోధన జరుగుతోందని, త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని ప్రకటించారు బాలయ్య.
బాలయ్య ప్రకటన ఇప్పుడు నందమూరి అభిమానుల్లో ఆనందం రేకెత్తించింది. విశ్వవిఖ్యాత నట సౌర్వభౌమ జీవిత చరిత్ర తెరపై చూడడం అనేది గొప్ప అనుభూతి. అందులో ఎన్టీఆర్ పాత్రను తానే పోషిస్తానని చెప్పడం ఇంకా ఆసక్తికరంగా వుంది.
కాగా, ఇటివలే ఎన్టీఆర్ బయోపిక్ ప్రస్తావన వచ్చింది. ఎన్టీఆర్ జీవితంపై సినిమా తీసే ఆలోచన లేదా? అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని అడిగితే.. ”లేదు. ఎన్టీఆర్ పై సినిమా తీయడం ఎవరివల్లా కాదని, ఎన్టీఆర్ బయోపిక్ అసాధ్యమని, రెండున్నర గంటల్లో ఆయన గురించి చెప్పడం సాధ్యపడదని” అభిప్రాయపడ్డాడు లోకేష్. ఇప్పుడు బాలయ్య , ఎన్టీఆర్ బయోపిక్ ను ప్రకటించడం లోకేష్ కు ఒక్కింత షాక్ ఇచ్చినట్లయింది.