ఎన్టీఆర్ బయోపిక్ ఈరోజు అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్ శివార్లలోని రామకృష్ణా స్టూడియోస్‌లో ఈ చిత్రానికి తొలి క్లాప్ పడింది. భారత ఉపరాష్ట్రతి వెంకయ్య నాయుడుతో పాటు తెలుగు సినిమాకి సంబంధించిన పలువురు ప్రముఖులు, ఎన్టీఆర్ టీమ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ…
”తల్లివల్ల శారీరక మానసిక సుచి శుభ్రత, తండ్రి వల్ల జ్ఞానం, ధర్మాధర్మ విచక్షణ అభిస్తుంది. వంశం వల్ల పరిపాలనా దక్షత సిద్దిస్తుంది. అష్ట ఐశ్వర్యాలు మన పుణ్యం వల్ల దక్కుతాయి. ఎన్టీఆర్… నాకు గురువు దైవం ఆయన. ఎన్టీఆర్ అనేమాట ఓ హృదయ స్పందన. తెలుగువారి గుండె చప్పుడు. ఆయన్ని కేవలం నా తండ్రిగానే చూడడం లేదు. ఓ శంకరాచార్యులవారు. రామానుజ చార్యులు, ఓ అంబేద్కర్, గాంధీ.. ఓ ఎన్టీఆర్. ఎటువంటి పరిస్థితుల్లోనూ తలవంచలేదు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడారు. కళ కళ కోసమే కాదు, సమాజం కోసం అని నమ్మారు. ఈరోజు జరిగింది రేపు మర్చిపోతున్నాం. ఎన్టీఆర్ చరిత్ర అలా కాకూడదు. ఆయన చరిత్ర శాశ్వతంగా నిలిచిపోవాలన్న ఓ తలంపుతో ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టాం. రామారావు గారి పాత్ర ఎవ్వరూ చేయలేరు. ఆ అదృష్టం నాకు దక్కింది. జాతీయ స్థాయి రాజకీయాల్లో ఎన్నో మార్పులకు ఆదర్శం ఆయన. భావితరాలకు గుర్తుండిపోవాలన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ప్రారంభించాం. మొత్తంగా తీస్తే ఆరుగంటల సినిమాల అవుతుంది. అంత ఉంది. ఆయన చరిత్ర. చెప్పాల్సింది ఎంతో ఉంది. కథ విషయంలో ఎలాంటి తొందరపాటు లేకుండా తెరకెక్కిస్తాం. ఈ కథని ఎలా కుదించాలి? ఎలా ఆయనకు న్యాయం చేయాలి? అనే విషయంపై కసరత్తు చేస్తున్నాం. కీరవాణి, బుర్రా సాయిమాధవ్, శ్రీనాథ్, తేజ… సాంకేతిక నిపుణులు చక్కగా కుదిరారు. ఈరోజు పాతాళభైరవి ఎక్ట్స్ట్రా ప్రింట్లతో విడుదలై సంచలనం సృష్టించింది. లవకుశ విడుదలైన రోజు కూడా ఇదే. నాన్నగారి మొదటి రంగుల చిత్రం దేశోద్ధారకుడు విడుదలైంది.. దాంతో పాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఇదే. నా మొదటి చిత్రం తాతయ్యకల ఈ బ్యానర్లో మొదటి చిత్రం ఇక్కడే మొదలైంది. అదే చోట నాన్నగారి సినిమా మొదలెట్టడం ఎంతో ఆనందంగా ఉంది. మాతరం ఎప్పుడూ యంగ్‌గానే ఉంటుంది. మరో ఇరవై ఏళ్లుంటాం. ఈమధ్య సినిమా సినిమాకీ కొత్తగా చేస్తూ వెళ్తున్నాను” అన్నారు.