ఈ మధ్య కాలంలో ‘బ్రాహ్మణుల’ మనోభావాలు దెబ్బతీసిన సినిమాలు చాలా వచ్చాయి. వాళ్ల ఆచారాలను, ఆహార సంప్రదాయాల్నీ వెటకారం చేస్తూ… దర్శకులు కామెడీ చేశారు. అంతకు ముందు.. ఈ పైచాచికత్వాన్ని చూస్తూ మిన్నకుండిపోయిన ఆ వర్గం ఆ తరవాత వీటిపై తిరుబాటు ధోరణి చూపించడం మొదలెట్టింది. ‘దేనికైనా రెడీ’ సమయంలో తమ నిరసనని, వ్యతిరేకతని బాహాటంగానే చూపించారు. అప్పటి నుంచీ… దర్శకులు కాస్త జాగ్రత్త పడిపోయారు. బ్రాహ్మణుల మనోభావాల్ని దెబ్బతీసే సన్నివేశాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు ‘జై సింహా’లో… ఈ వర్గాన్ని ఆకట్టుకొనేలా ప్రత్యేక సన్నివేశాల్ని రూపొదించారు. ఓ సన్నివేశంలో 2వేల మంది పురోహితులు కనిపించబోతున్నారు. వాళ్ల గొప్పదనం, అసలు పురోహితులు లేకపోతే ఈ దేశం ఏమైపోతుందో చెబుతూ బాలయ్య చెప్పే డైలాగులు, ఆ వెంటనే వచ్చే పోరాట సన్నివేశాలు ఇవన్నీ హైలెట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. ”పురోహితుల గురించి ఓ సన్నివేశంలో చాలా గొప్పగా చెప్పాం. ఆ సన్నివేశం, అందులోని బాలయ్య నటన, చెప్పే డైలాగులు చూస్తే… బ్రాహ్మణులంతా బాలయ్యకు ఫ్యాన్స్ అయిపోతారు” అంటూ నిర్మాత సి.కల్యాణ్ వ్యాఖ్యానించారు. రాస్తా రోకోలు, ధర్నాలు చేసేవాళ్లని ఉద్దేశించి ఓ సీన్ ఉందట. అది కూడా రోమాలు నిక్కబొడిచే స్థాయిలో ఉందని తెలుస్తోంది. ఈ రెండు సీన్లు, వాటిని అనుసరిస్తూ వచ్చే యాక్షన్ సన్నివేశాలు మాస్‌ని ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.