టాలీవుడ్ హీరోలపై ఓ అపవాదు ఉంది. స్టార్ హీరోల వయసు యాభైకి పైబడినా ఇప్పటికీ కుర్ర హీరోల్లా కనిపించడానికి తాపత్రయపడుతుంటారని, తమ కూతురు వయసున్న హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి ఏమాత్రం వెనుకంజ వేయరని నెగిటీవ్ కామెంట్లు చేస్తుంటారు. ఆ మాటల్లోనూ నిజం ఉంది. అగ్ర హీరోలుగా చలామణీ అవుతున్నవాళ్ల వయసు 50 దాటేసింది. వాళ్లంతా తెలుగు సినిమా వరకూ వచ్చేసరికి పెళ్లికాని బ్రహ్మచారి పాత్రల్లోనే కనిపించడానికి మొగ్గు చూపుతుంటారు. అయితే ఓ మంచి కథ వస్తే.. ఈ ట్రెండ్‌నీ, తమ ఇమేజ్‌నీ పక్కన పెట్టడానికి కూడా సిద్ధం అవుతుంటారు… అచ్చం మన నందమూరి బాలకృష్ణలా.
అవును.. బాలయ్య తన కెరీర్లోనే ఓ విభిన్న ప్రయోగం చేయబోతున్నాడని టాక్. ఆయన కృష్ణ వంశీ దర్శకత్వంలో నటించబోయే చిత్రం.. `రైతు`. ఈ సినిమాలో 70 ఏళ్ల వ్యక్తిగా బాలయ్య కనిపించబోతున్నాడట. అంటే… పండు ముదుసలి అన్నమాట. ఓల్డ్ గెటప్పుల్లో కనిపించడం బాలయ్యకు కొత్తేం కాదు. పెద్దన్నయ్య నుంచి అధినాయకుడు వరకూ ఆ తరహా పాత్రలు బాగా పండించాడు. అయితే.. అందులో యంగ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. డ్యూయెట్లు, లవ్… మామూలే. అయితే రైతులో మాత్రం బాలయ్య ఓపెనింగ్ సీన్ నుంచీ శుభం కార్డు వరకూ 70 ఏళ్ల ముసలి వ్యక్తిగానే కనిపించనున్నాడట. ఓ రైతు ఎలా ఉంటాడో.. ఎలా ఆలోచిస్తాడో, ఎలా నడుస్తాడో.. ఏం కట్టుకొంటాడో.. అలానే బాలయ్య పాత్ర ఉండబోతోందట. టాలీవుడ్ వరకూ నిజంగా ఇది కనీవినీ ఎరుగని ప్రయోగమే. కేవలం కథ నచ్చి.. అందులో తన పాత్ర నచ్చి… ఈ ప్రయోగం చేయడానికి బాలయ్య ముందుకొచ్చాడట. బాలయ్య ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా గొప్ప విషయమే. కానీ.. ఆయన ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకొంటారో చూడాలి.