`నన్నెవరూ పిలవలేదు.. నాకెలాంటి ఆహ్వానాలూ రాలేదు` అని ఆమధ్య బాలకృష్ణ నేరుగా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. సినీ పెద్దల మీటింగులకు… బాలయ్య రాకపోవడం పట్ల సంధించిన ప్రశ్నకు.. బాలయ్య ఆగ్రహావేశ సమాధానం అది. ఈసారీ అదే జరిగింది. చిరంజీవి ఇంట్లో ఓ కీలకమైన మీటింగ్ జరిగింది. దానికి బాలయ్య రాలేదు. అలా అనడం కంటే, బాలయ్యకు ఆహ్వానం అందలేదు అనడం సబబు. ఒకవేళ ఆహ్వానిస్తే బాలయ్య వస్తారో, రాదో తెలీదు గానీ, ప్రస్తుతానికి మాత్రం బాలయ్యని పనిగట్టుకుని మరీ కెలికినట్టు అయ్యింది.
చిరంజీవి ఇంట్లో కీలకమైన సమావేశం జరిగింది. ఇండ్రస్ట్రీ అవసరాల దృష్ట్యా ఈ మీటింగ్ అత్యవసరం. జగన్ తో అప్పాయింట్ దొరికిన నేపథ్యంలో,… ఆయనతో ఏం మాట్లాడాలి? ఇండ్రస్ట్రీకి ఎలాంటి వరాలు కోరాలి? అనే విషయంపై ముందుగా వాళ్లలో వాళ్లు ఓ అవగాహన కల్పించుకుని.. అవే విషయాలు సీఎం దగ్గరకు తీసుకెళ్లడానికే ఈ మీటింగ్. ఆ సమావేశంలో బాలయ్య కనిపించలేదు. ఇండ్రస్ట్రీలోని అగ్ర కథానాయకుల్లో బాలయ్య ఒకరు. ఆయనకు రాజకీయాలతోనూ ముడి ఉంది. కాబట్టి.. ఆయన్ని పిలిస్తే బాగుండేది. అయితే.. జగన్ తో భేటీ అంటే బాలయ్య కచ్చితంగా రాడు. ఎందుకంటే ఆయనదో పార్టీ. ఈయనదో పార్టీ. `మాకు ఈ వసతులు కల్పించండి` అంటూ బాలయ్య.. జగన్ ని అడగడం కలలోని మాట.
అందుకే చిరు బాలయ్యని ఆహ్వానించి ఉండకపోవొచ్చు.
నిజానికి ఇదో అంతర్గత వ్యవహారం. దాన్ని మీడియాకు లీక్ చేయాల్సిన అవసరం లేదు. చిరు ఇంట్లో మీటింగ్ ఏర్పాటు చేశారన్న విషయం చిరు పీఆర్ నే మీడియాకు సమాచారం అందించింది. అక్కడ్నుంచి వాళ్లు రాలేదా? వీళ్లు రాలేదా? అనే ఆరాలు ఎక్కువయ్యాయి. ఈ మీటింగ్ ని గోప్యంగా చేసుకుంటే ఏ గొడవా ఉండేది కాదేమో..?