సినీ హీరో కమ్ ఎమ్మెల్యే బాలకృష్ణ తన బావ కళ్ళలో ఆనందం చూడాలనుకున్నారా? అందుకే ఆవేశ పడ్డారా? ఇలాంటి సందేహం బుధవారం ఎవరిలో నైనా కలిగే ఉంటుంది.
విశాఖపట్నం లో బుధవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు బాలకృష్ణ. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విపక్ష పార్టీ వైసీపీ మీద విరుచుకుపడ్డారు. ఆ పార్టీ తమ తెలుగుదేశం పార్టీ తో పోటీ పడడం అంటే… పొట్టేలు వచ్చి కొండను ఢీ కొట్టినట్టే అని ఆయన తేల్చి పారేశారు. ఉప ఎన్నికల్లో ప్రతిపక్షం కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. స్వంత లాభం తప్ప విపక్ష పార్టీకి రాష్ట్ర అభివృద్ధి పట్టడం లేదని తిట్టిపోశారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా తమ పార్టీ పనిచేస్తోంది అని చెప్పారు.
సాధారణంగా బాలకృష్ణ విమర్శలు విషయం లో కాస్త పొదుపుగానే ఉంటారు. మిగతా తే దే పా నేతలతో పోల్చుకుంటే… కారణం ఏమిటో గాని వైసీపీ, జగన్ ల పై బాలయ్య చాలా తక్కువ గానే నోరు చేసుకుంటారు. అలాంటి బాలయ్య కూడా ఈ స్థాయిలో విమర్శలకు దిగడం వెనుక బావ ప్రత్యక్ష, పరోక్ష ఆకాంక్షే కారణం కావొచ్చు అని పలువురు పరిశీలకులు భావిస్తున్నారు.
ముఖ్యంగా… జగన్ పాదయాత్ర తర్వాత తే దే పా నేతల్లో విమర్శలు చేయని వారంటూ కనపడడం లేదు. విదేశాల్లో తనకు డబ్బున్నట్టు నిరూపించమని తాజాగా15 రోజులు గడువు ఇచ్చి నేరుగా చంద్రబాబు కి జగన్ సవాల్ చేయడంతో… ఈ విమర్శలు మరింత జోరు అందుకున్నాయి. ఈ క్రమంలో తాను సైతం తన వంతు భాగంగా బాలయ్య ఇలా ఆవేశాన్ని ప్రకటించారన్నమాట. ఏదేమైనా… ఈ జోరును బాలయ్య కొనసాగిస్తే తే దే పా శ్రేణులకు అంతకంటే కావాల్సింది ఏముంది?