తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నందమూరి బాలకృష్ణ మొదటి సారి తన మార్క్ టెంపర్ ను మలక్ పేట నియోజకవర్గంలో చూపించారు. గడ్డి అన్నారంలో .. రోడ్ షో నిర్వహించిన బాలకృష్ణ… తన ప్రసంగంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌లను తనదైన శైలిలో టార్గెట్ చేశారు. ఆంధ్రలో జరగబోయే ఎన్నికల్లో వేలు పెడతానంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ.. “ఆంధ్రకు వస్తావా..? రా.. దమ్ముంటే చూసుకుందాం” అంటూ సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఆంధ్రా ప్రజలకు అన్యాయం జరిగితే తెలంగాణ ప్రజలు కూడా వారితో కలిసి ఉద్యమిస్తారంటూ హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఆంధ్రా ప్రజలూ తిరగబడతారన్నారు. తెలంగాణ ప్రజలు తరిమితే.. కేసీఆర్, కేటీఆర్..ఆంధ్రకు కాదు.. ఎక్కడికైనా పారిపోవాల్సిందేనన్నారు.
నాలుగైదు రోజులుగా రోడ్ షోలు చేస్తున్న బాలకృష్ణ..కేసీఆర్ పై తీవ్రమైన విమర్శలేమీ చేయలేదు … కానీ ఇప్పుడు టోన్ మార్చారు. కేసీఆర్ తీరును తీవ్ర స్థాయిలో ఎండగడుతున్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏం చెప్పుకుంటారని ప్రశ్నిస్తున్నారు. “సెక్రటేరియట్‌కు రాలేకపోయానని, మహిళలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించలేదని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ.2లక్షల కోట్ల అప్పులు చేసిన మోసగాడినని చెప్పుకుంటారా..? ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఏమని చెప్పుకుంటారు సీఎం కేసీఆర్? అంటూ.. ఆనర్గళంగా డైలాగులు చెప్పేస్తున్నారు. పనిలో పనిగా చంద్రబాబును ఆకాశనికెత్తేస్తున్నారు. హైదరాబాద్ మీద చంద్రబాబు తనదైన ముద్ర వేశారని ఏదో నాలుగు గొర్రెలను తీసుకొచ్చి మేము పీకినాం అంటే కుదరదని స్పష్టం చేశారు. “చంద్రబాబు బుద్ధిగా ఆయన పని ఆయన చేసుకునేటోడు. అసలు ఏడ్చేటోడు కానేకాదు. పక్కా దిల్లీ, గల్లీలో వేలు పెట్టేవాడు కాదు. విదేశాల్లో గల్లీ గల్లీ తిరిగి పెట్టుబడులు రాబట్టే వాడు మన చంద్రబాబు” అని తెలంగాణ యాసలోనే పొగిడేస్తున్నారు.
బాలకృష్ణ ఏం మాట్లాడినా… ఆయన సినిమా స్టైల్లో చెప్పే మాటల వల్ల మరింత వివాదాస్పదం అవుతుంది. కొద్ది రోజుల కిందట.. మోడీ గురించి ఆయన చేసిన హిందీ ప్రసంగం ఇప్పటికీ.. ఏపీ బీజేపీ నేతల చెవుల్లో గింగురుమంటూనే ఉంటుంది. దానిపై గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఆ స్థాయిలో లేకపోయినా… కాస్త గౌరవంగానే ఉన్నా.. ఇప్పుడు బాలకృష్ణ టీఆర్ఎస్ పై చేసిన విమర్శలు కటువుగానే ఉన్నాయి. మరి టీఆర్ఎస్ నేతలు స్పందిస్తారా..?