తన వందో సినిమా విషయంలో నందమూరి బాలకృష్ణ ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. సినిమాని ఎలాగైనా హై స్టాండర్డ్‌లో తీయాలన్నది బాలకృష్ణ సంకల్పం. ఇది తనకు ఓ మైలు రాయిలాంటి సినిమా. అందుకే ఎలాగైనా.. ప్రత్యేకంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన ఆయనది. ఇప్పటికే క్రిష్ బడ్జెట్ లెక్కలు కూడా వేసేశాడు. రూ.50 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని ఓ అంచనాకు వచ్చాడు. అంత ఖర్చు పెడితే తప్ప.. ఈ సినిమా అనుకొన్న స్టాండర్డ్స్‌తో తెరకెక్కించలేమన్నది క్రిష్ మాట. దానికి బాలయ్య నుంచి కూడా సపోర్ట్ అందుతోంది.
వందో సినిమా మరింత క్వాలిటీ మేకింగ్‌తో తెరకెక్కించడానికి బాలయ్య ఓ ప్లాన్ వేశాడు. పారితోషికాల దగ్గరే ఎక్కువ బడ్జెట్ పోతోందని గ్రహించిన బాలయ్య.. పారితోషికాల పై భారీ `కోత` విధించాలని భావిస్తున్నాడని టాక్. ముందు తన పారితోషికం తగ్గించుకొని తన టీమ్‌కి ఆదర్శంగా నిలవాలనుకొంటున్నాడట. ”తెలుగు వారి చరిత్రకు సంబంధించిన కథ ఇది. మన గొప్పదనాన్ని చాటి చెప్పే ఈ సినిమా కోసం అందరూ పారితోషికాలు తగ్గించుకోండి” అని తన టీమ్‌తో చెబుతున్నాడట. అలా.. పారితోషికాలపై పెట్టే పెట్టుబడి.. సినిమా మేకింగ్‌లో చూపిస్తే.. ఇంకా మంచి ఫలితం వస్తుందన్నది బాలయ్య ఆలోచన. ఒకవేళ సినిమా భారీ లాభాలు సాధిస్తే… అప్పుడు పారితోషికాలు తగ్గించుకొన్నవాళ్లందరికీ తిరిగి చెల్లిస్తామని బాలయ్య చెబుతున్నాడట. ఈ ప్రతిపాదన బాగానే ఉండడంతో… మిగిలిన వాళ్లు కూడా తమ పారితోషికాన్ని తగ్గించుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారని తెలుస్తోంది.