ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా జిల్లాల విభజన చేయబోతోందన్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో… ఏపీలో రాజకీయ నేతలు ఎవరి డిమాండ్లు వారు వినిపించడం ప్రారంభించారు. వీరి జాబితాలోకి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా చేరారు. హిందూపురం కేంద్రంగానే కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. నేరుగా ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. ఏపీ సర్కార్ అనుకున్నదాని ప్రకారం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. పార్లమెంట్ నియోజకవర్గాలన్నీ.,. జిల్లాలుగా మారుస్తారు. హిందూపురం కూడా పార్లమెంట్ నియోజకవర్గమే.. కాబట్టి జిల్లాగా మారుతుంది.
కానీ.. జిల్లా కేంద్రం హిందూపురంను కాకుండా… ఇతర ప్రాంతాలను చేసే ఆలోచనలో ఏపీ సర్కార్ ఉంది. అందు కోసం.. ఇతర నియోజకవర్గాల నేతలు… హైకమాండ్ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో అప్రమత్తమైన నందమూరి బాలకృష్ణ.. నేరుగా ముఖ్యమంత్రికే లేఖ రాశారు. ఇటీవల హిందూపురానికి ఓ మెడికల్ కాలేజీ కూడా మంజూరయింది. ఆ ఆమెడికల్ కాలేజీ అక్కడే పెడితే.. జిల్లా కేంద్రం కూడా అక్కడే పెట్టాల్సి వస్తుంది. దీంతో.. ఆ మెడికల్ కాలేజీని కూడా మారుస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది.
ఇదేదో మొత్తం తేడాగా ఉండటంతో బాలకృష్ణ.., ఉన్న పళంగా రంగంలోకి దిగారు. మెడికల్ కాలేజీని కూడా మార్చవద్దని డిమాండ్ చేశారు. ఇప్పటికే స్థలం కూడా.. చూశారని.. దాదాపుగా ఖరారు చేశారని..ఇలాంటి సమయంలో.. మెడికల్ కాలేజీని హిందూపురం నుంచి తరలించడం మంచిది కాదన్నారు. అయితే.. వైసీపీ నాయకత్వం ఏమనుకుంటుందో మాత్రం క్లారిటీ లేదు. అందుకే బాలకృష్ణ.. ఎమ్మెల్యేగా తన వంతు ప్రయత్నాలు తాను చేస్తున్నారు.