ఈ సంక్రాంతికి 4 సినిమాలు వస్తున్నాయి. నాలుగూ పెద్దవే. కాబట్టి… థియేటర్ల సమస్య ఎదురుకావడం సహజం. నాలుగూ క్రేజీ ప్రాజెక్టులే అయినా.. దేనికీ కావల్సిన స్థాయిలో థియేటర్లు దొరకడం లేదు. అయితే… నందమూరి బాలకృష్ణ తీసుకున్న ముందు జాగ్రత్త వల్ల.. ‘ఎన్టీఆర్’కి కాస్త సానుకూలత ఏర్పడింది. ఈ సినిమాని 9నే విడుదల చేయాలనుకోవడం బాగా కలిసొచ్చింది. ఎందుకంటే.. తొలి బోణీ తనదే కావడం వల్ల.. కావల్సిన సంఖ్యలో థియేటర్లు దొరుకుతాయి. దానికి తోడు… బాలకృష్ణ కొన్ని ముందు జాగ్రత్త చర్యలూ తీసుకున్నట్టు సమాచారం. థియేటర్లు ఎవరెవరి చేతుల్లో ఉన్నాయో.. వాళ్లందరికీ బాలయ్య స్వయంగా ఫోన్లు చేసి.. మాట్లాడాడట. ‘ఎన్టీఆర్ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించా.. థియేటర్లుఎక్కువ సంఖ్యలో కావాలి’ అంటూ పర్సనల్‌గా రిక్వెస్ట్ చేశాడట. దాంతో.. దిల్‌రాజు, ఏసియన్ సునీల్, అల్లు అరవింద్ మొదలైన వాళ్లంతా.. బాలయ్యపై గౌరవంతో… థియేటర్లని అట్టిపెట్టారు. బాలయ్య 9న వస్తున్నాడనే… రెండు రోజుల గ్యాప్ ఇచ్చి.. 11న వినయ విధేయ రామ విడుదల చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాని జనవరి 10నే విడుదల చేయాలని ముందు భావించార్ట. బాలయ్య సినిమాకు కనీసం రెండు రోజుల గ్యాప్ ఇవ్వాలని చరణ్ సినిమా ఆలస్యమైందని టాక్.
మరోవైపు ‘పేట’కు కావల్సిన సంఖ్యలో థియేటర్లు దొరకలేదని ఆ నిర్మాత వాపోతున్నాడు. ఈ విషయమై కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. `పేట` కూడా సంక్రాంతికే వస్తుందన్న సంగతి తెలిసి.. ‘సంక్రాంతికి వస్తే… థియేటర్లు దొరకవు.. కావాలంటే 18న విడుదల చేసుకోండి.. తమిళంలో కంటే ఓ వారం రోజులు ఆలస్యంగా విడుదలైనా పెద్దగా నష్టమేమీ ఉండదు..’ అని సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ.. సదరు నిర్మాత ఈ సలహాల్ని పక్కన పెట్టాడని, మొండిగా విడుదల చేయడానికి రెడీ అయ్యాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతికి తెలుగు నాట గట్టి పోటీ ఉంటుందని భావించిన సన్ నెట్ వర్క్… ఈ సినిమాని పేరున్న నిర్మాత చేతుల్లో పెట్టాలని గట్టిగా ప్రయత్నించిందని, కానీ… ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో.. ‘సర్కార్’ని తెలుగులో విడుదల చేసి హిట్టు కొట్టిన వల్లభనేని అశోక్‌కి ఇచ్చారని సమాచారం అందుతోంది.