నటుడిగా నలభై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం బాలకృష్ణది. వంద సినిమాల చరిత్ర బాలయ్య సొంతం! మాస్‌ని మెప్పించడంలో బాలయ్య తిరుగులేని కథానాయకుడు. డైలాగ్ చెప్పాడంటే డైనమేట్ కూడా బలాదూరే. అలాంటి బాలయ్య ఒక్క విషయంలో.. ఒకే ఒక్క విషయంలో బాగా వీకు. అదే.. స్టేజ్ పై స్పీచులివ్వడంలో. మైకు పట్టుకొంటే సుదీర్ఘమైన ప్రసంగాలు ఇస్తుంటాడు బాలయ్య. అందులోనూ అచ్చ తెలుగులోనే మాట్లాడుతుంటాడు. కానీ ఏం లాభం..?? అందులో `విషయం` శూన్యం. ఎక్కడో మొదలెట్టి, దాన్ని మధ్యలో వదిలేసి ఇంకెక్కడికో వెళ్లి, మొదలుకీ చివరికీ సంబంధం లేకుండా స్పీచులు ముగిస్తుంటాడు. దాంతో బాలయ్య సీరియస్ స్పీచులు కూడా కామెడీగా మారిపోతుంటుంది. బాలయ్య స్పీచులు నిరంతరం ఫాలో అవుతున్న ఫ్యాన్స్.. `ఇదేంటి బాలయ్య ఎప్పుడూ ఒక్కటే విషయం మాట్లాడుతుంటాడు..` అని ఫీలవుతున్నారు కూడా.
బాలయ్యతో పాటు ఎదిగిన చిరు, నాగార్జున… స్పీచుల విషయంలో ఎక్కడికో వెళ్లిపోయారు. చిరు డ్రమటిక్‌గా మాట్లాడినా అందులో విషయం ఉంటుంది. నాగ్ మాట్లాడితే.. అందులోనూ మేటర్ ఉంటుంది. పదాల్ని వెదుక్కొని మాట్లాడడం చిరు, నాగ్ల విషయంలో ఎప్పుడూ జరగలేదు. వెంకీ అయితే మాట్లాడేదే తక్కువ. నవతరం హీరోలు మైకాసురులే. పట్టుకొంటే వదలరు. ఎన్టీఆర్ ఈ విషయంలో అందరి కంటే ముందుంటాడు. సూటిగా స్పష్టంగా అనర్గళంగా.. ఎంతసేపయినా మాట్లాడతాడు. కానీ అదే నందమూరి వంశం నుంచి వచ్చిన బాలయ్య స్పీచులివ్వడం ఎప్పుడు నేర్చుకొంటాడో అన్నది అందరి ప్రశ్న.
సంస్క్రృత సమాసాల్ని వల్లించడంలో, పురాణాల్ని… ఆ పాత్రల్ని గుర్తు చేయడంలో బాలయ్య సూపర్. ఆ విషయంలో డౌటు లేదు. కానీ చెప్పే విషయమైనా అర్థమయ్యేలా చెప్పాలి కదా? ‘ఆ రోజుల్లో మా నాన్నగారూ..’ అని మొదలెట్టిన వాక్యం ఎక్కడ ఆగుతుందో చెప్పలేం. `ఈ అభిమాన దురభిమాన, పండిత పామర, సంగీత సాహిత్య ` అంటూ సంబంధం లేని వాక్యాలు, జంట పదాలు.. బాలయ్య ప్రసంగాల్లో తరచూ తచ్చాడుతూ ఉంటాయి. నాన్నగారిని గుర్తు చేసుకొనే సందర్భాల్లో, అభిమానుల కోసం మాట్లాడే విషయంలో బాలయ్య ప్రసంగం దశాబ్దాల నుంచీ ఒకేలా సాగుతుందంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. బాలయ్య ఏం మాట్లాడబోతున్నాడో ముందుగానే అభిమానులు, పాత్రికేయులు ఊహించగలుగుతున్నారంటే.. స్పీచుల విషయంలో బాలయ్య ఎలాంటి ప్రిపరేషన్లూ లేకుండా వస్తున్నాడన్న విషయం ఈజీగా అర్థమైపోతుంది. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా మొదలైనప్పడు ఓ స్పీచ్ రాసుకొంటే.. అది పూర్తయి బయటకు వచ్చేంత వరకూ దాన్నే పాఠంగా వల్లిస్తుంటాడు బాలయ్య. దాంతో బాలయ్య స్పీచులంటే రాను రాను ఆసక్తి తగ్గిపోతూ వస్తోంది.
నిజానికి అంత అనుభవం ఉన్న కథానాయకుడు, తెలుగు భాషపై అంత పట్టున్న నటుడు ఎంతలా మాట్లాడాలి? గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా చేసిన అనుభవాలు ఎన్నుంటాయి..? వాటిని అభిమానులతో పంచుకొంటే ఎంత బాగుంటుంది? కల్మషం లేకుండా మాట్లాడడం బాలయ్య నైజం. దానికి తన అనుభవం జోడిస్తే ఇంకెంత బాగుంటుంది? ఎప్పుడూ ఒకే స్పీచ్‌తో బోర్ కొట్టిస్తూ అటు అభిమానుల్ని కూడా తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు ఈ నందమూరి హీరో! అన్ని విషయాల్లోనూ అందరికీ ఆదర్శంగా ఉండే బాలయ్య స్పీచుల విషయంలోనూ కాస్త పద్ధతి మార్చుకొంటే బాగుంటుంది.