నందమూరి బాలకృష్ణకు సెంటిమెంట్లు ఎక్కువన్న సంగతి తెలిసే ఉంటుంది. ఆయన ఏం పనిచేయాలన్నా ముహూర్తాలు చూడాల్సిందే. బాలయ్య సినిమా ప్రారంభోత్సవాలు, ఆడియో రిలీజ్ ఫంక్షన్లు, సినిమా విడుదలలూ ఇలా అన్ని ముహూర్తాల ప్రకారం జరుగుతుంటాయి. ఇప్పుడు ఆయన బయటి సినిమాలకూ ముహూర్తాలు పెట్టేస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, తనయుడు ఆకాష్ పూరి కథానాయకుడిగా మెహబూబా సినిమా ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో ప్రారంభమైంది. ఈ సినిమాకి మూహూర్తం పెట్టింది అక్షరాలా.. నందమూరి బాలకృష్ణ. ఈ విషయాన్ని పూరి స్వయంగా చెప్పారు.
”బాలయ్య చెప్పిన సమయానికే ఈసినిమా ప్రారంభించాం” అంటున్నారు పూరి. బాలకృష్ణతో పూరి జగన్నాథ్.. ‘పైసా వసూల్’ అనే సినిమా తీశారు. ఆ చిత్రం బాక్సాఫీసు దగ్గర ఆశించిన విజయం అందుకోలేకపోయినా.. బాలయ్యను కొత్తగా చూపించాడన్న క్రెడిట్ దక్కించుకొన్నాడు పూరి. వీరిద్దరి కాంబోలో మరో సినిమా కూడా రాబోతోంది. ఆ స్నేహం కొద్దీ… పూరి సినిమా క్లాప్ కొట్టడానికి బాలయ్య ముహూర్తం చూశాడట. మున్ముందు బాలయ్య దగ్గరకు ఆయన సన్నిహితులు, స్నేహితులు ముహూర్తాల కోసం వెళ్తుంటే.. ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.