ఈమధ్య కథానాయకులు పారితోషికం విషయంలో కొత్త పంథాని అనుసరించడం మొదలెట్టారు. పారితోషికం బదులు.. సినిమాలో వాటా అందుకొంటున్నారు. ఈ విషయంలో మిగిలిన టాప్ హీరోలందరికీ మహేష్ బాబు ఆదర్శంగా నిలిచాడు. శ్రీమంతుడుకీ, మొన్నటికి మొన్న బ్రహ్మోత్సవం సినిమాకీ మహేష్ వాటాలే అందుకొన్నాడు. పవన్ కల్యాణ్ కూడా మహేష్‌ని అనుసరించాడు. సర్దార్ గబ్బర్‌సింగ్‌కి పవన్ నిర్మాణ భాగస్వామి. ఇప్పుడు బాలకృష్ణ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయిపోతున్నట్టు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి. ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత కూడా క్రిష్‌నే. అయితే.. బాలయ్య ఈ సినిమాలో పారితోషికం బదులుగా వాటా తీసుకొంటున్నాడని తెలుస్తోంది.
ఈ సినిమా బిజినెస్ అయిపోయిన తరవాత లాభాల్లో 50 శాతం వాటా అందుకోబోతున్నట్టు టాక్. రూ.40 నుంచి రూ.50 కోట్లలో ఈ సినిమాని పూర్తి చేయాలని భావిస్తున్నారట. శాటిలైట్ తో కలిపి కనీసం రూ.70 కోట్ల వరకూ బిజినెస్ చేయాలని చిత్రబృందం ఆలోచన. ఆ లెక్కడ దాదాపుగా రూ.25 కోట్ల వరకూ లాభాలు అందుకోవొచ్చు. బాలయ్య వందో సినిమా కాబట్టి రూ.70 కోట్ల బిజినెస్ జరగడం అసాధ్యమేం కాదు. సో… బాలయ్య ప్లాన్ బాగానే వర్కవుట్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.