నందమూరి బాలకృష్ణ మాట్లాడుతుంటే… భలే ఇదిగా ఉంటుంది. ఒక పదానికీ మరో పదానికీ లింకులు లేకపోయినా.. వినడానికీ, బాలయ్య ఎక్స్ప్రెషన్ చూడ్డానికి మనసు ఉత్సాహపడిపోతుంటుంది. బాలయ్య ప్రసంగాలెప్పుడూ ఒకేలా ఉంటాయన్నది ఓ విమర్శ. అయితే… తొలిసారి బాలయ్య కొత్త కొత్తగా మాట్లాడాడు. సరదాగా మాట్లాడుతూ జోకులు వేశాడు. గౌతమిపుత్ర శాతకర్ణి ప్రెస్ మీట్ ఈరోజు రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా అభిమానుల్ని కలుసుకొన్నాడు బాలయ్య. దేశ వ్యాప్తంగా ఉన్న పుణ్య క్షేత్రాలన్నీ తిరిగి.. అక్కడి నుంచి తీర్థ ప్రసాదాల్ని తీసుకొచ్చిన తన అభిమానగణాన్ని బాలయ్య సత్కరించాడు.
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. జోకులు పేల్చాడు. తన వందో సినిమాకి ప్రకృతి ఏ విధంగా సహకరించిందే చెబుతూ బాలయ్య ఇచ్చిన స్పీచు.. అందరినీ ఆకట్టుకొంది. జార్జియాలో షూటింగ్ మొదలెట్టినప్పుడు అక్కడ జోరుగా వర్షం పడిందట. `మనకు ఎండ కావాలి కదా.. కొద్ది సేపట్లో వర్షం తెప్పిస్తా చూడండి` అంటూ బాలయ్య తన చిత్రబృందంతో చెప్పాడట. అలా బాలయ్య చెప్పినట్టే ఎండ వచ్చేసిందట. సూర్య భగవానుడు అంటే తనకు ఇష్టమని, అందుకే ఎంత ఎండ ఉన్నా గొడుకు పట్టనివ్వనని, అయితే తనతో పాటు కూర్చున్న తోటి నటీనటులు కూడా తనతోనే ఆ ఎండలోనే మాడాల్సివస్తోందని చమత్కరించాడు. బాబు ఏమనుకొంటాడో అనుకొని పైకి ఏం చెప్పరని సహనటుల గురించి వ్యాఖ్యానించాడు బాలయ్య. పనిలో పనిగా ఎన్నో సంస్ర్కత శ్లోకాల్ని ఎప్పటిలానే గడగడ అప్పగించాడు. అయితే అభిమానులందర్నీ పేరు పేరునా పలకరించి, వాళ్లని సత్కరించిన విధానం మాత్రం ముచ్చటేసింది. అందుకే అన్నారు… జై జై బాలయ్యా.. అని.