తన పుట్టినరోజు సందర్భంగా టీవీ ఛానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నందమూరి అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు బాలకృష్ణ. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలకృష్ణ పెదవి విప్పారు. వివరాల్లోకి వెళితే ..
బాలకృష్ణ, తన పుట్టిన రోజు సందర్భంగా టీవీ చానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాల పై ఎటువంటి మొహమాటం లేకుండా మాట్లాడారు. అనేక విషయాలపై ఓపెన్ గా తన అభిప్రాయాలు వెలిబుచ్చారు బాలకృష్ణ. ఇంటర్వ్యూ లో టీవీ యాంకర్ , బాలకృష్ణ చేయాలి అనుకుంటూ చేయలేకపోతున్న మూడు సినిమాల గురించి ప్రస్తావించారు. అవి నర్తనశాల, ఆదిత్య369 కి సీక్వెల్, ఛెంగిజ్ ఖాన్ పాత్ర . అయితే నర్తనశాల సినిమాని పునఃప్రారంభం చేసే ఆలోచన తనకు లేదని నిర్మొహమాటంగా చెప్పేశారు బాలకృష్ణ. అప్పట్లో ద్రౌపది పాత్రకు సౌందర్య లాంటి నటి దొరికిందని ప్రారంభించానని, ఇప్పుడు ద్రౌపది పాత్రకు సూట్ అయ్యే నటీమణులు లేరని, ఒక్క పాత్ర మిస్ కాస్టింగ్ జరిగితే మొత్తం సినిమా దెబ్బతినే ప్రమాదం ఉందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఇక ఛెంగిజ్ ఖాన్ పాత్ర భవిష్యత్తులో చేస్తా అని, దానికి ఇప్పుడే తొందరేముంది అని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే ఆదిత్య 369 సీక్వెల్ గురించి మాట్లాడుతూ పాజిటివ్ అప్ డేట్ ఇచ్చారు బాలకృష్ణ. తప్పకుండా ఈ సినిమా ఉంటుందని, అది కూడా త్వరలోనే ఉంటుందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. పైగా తాను , తన కుమారుడు మోక్షజ్ఞ ఈ సినిమాలో కలిసి నటిస్తామని వెల్లడి చేశారు బాలకృష్ణ. తాను సినిమాల్లోకి వచ్చిన మొదట్లో కూడా తన తండ్రి తో పాటు కలిసి నటించినట్లు, అప్పట్లో ఆయన తన అనుభవాన్ని రంగరించి తనకు మెళకువలు నేర్పినట్లు గుర్తు చేసుకున్న బాలకృష్ణ, తన కుమారుడు కూడా మొదటి సినిమా తనతోపాటు కలిసి నటిస్తే తన అనుభవాన్నంతా రంగరించి మోక్షజ్ఞ కి అనేక మెళకువలు నేర్పిస్తానని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. దాంతో పాటు ఈ సినిమాకు తానే స్వయంగా కథను సమకూరుస్తున్నానని కూడా వెల్లడి చేశారు బాలకృష్ణ. ఈ కథను విన్న ఆదిత్య 369 దర్శకులు సింగీతం శ్రీనివాస్ రావు కూడా ఈ కథను మొదటి భాగానికి దర్శకత్వం వహించిన దర్శకుడిగా తాను కానీ , లేదంటే స్వయంగా బాలకృష్ణ కానీ మాత్రమే న్యాయం చేయగలరని, వేరే దర్శకులకు ఈ కథను అప్పగించ వద్దని ఆయన వ్యాఖ్యానించినట్లు బాలకృష్ణ వెల్లడి చేశారు.
మొత్తానికి పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ ఇచ్చిన అప్డేట్ నందమూరి అభిమానులకు ఉత్సాహాన్ని తీసుకు వచ్చింది.