నటుడు శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ నంద్యాల పర్యటన టిడిపి శిబిరంలో కాస్త జోష్ తీసుకొచ్చినట్టు కనిపించింది. ఆయన పర్యటనలో చాలా సందడి నెలకొంది.ఆయన కూడా కొన్ని అంశాలపై కేంద్రీకరించి ప్రచారం చేయాలనే వ్యూహంతో వచ్చినట్టున్నారు. జగన్ మాటలకు సమాధానం అన్నట్టు బాలకృష్ణ కూడా ప్రత్యర్థులను కాల్చేయాలని పిలుపునిచ్చారు.
అయితే కొంతమందిలా మాట్లాడ్డం గాక బ్యాలెట్‌నే బుల్లెట్‌గా చేసి కాల్చాలన్నది ఆయన చమత్కారం. నిజానికి ఈ మాటలు ఇంతకూ ముందూ వచ్చినా బాలయ్య డైలాగులు కావడంతో పేలాయి. నాన్నగారు టిడిపి స్థాపించడం, నంద్యాలతో అనుబంధం, నటుడుగా తాను షూటింగుకు వస్తే భూమా నాగిరెడ్డి దంపతులు ఇళ్లు ఖాళీ చేసి ఇవ్వడం లాటి విషయాలతో పాటు తాను నరసింహస్వామి భక్తుడనంటూ స్థానిక ఆధ్యాత్మికత జోడించారు. భూమా అఖిల ప్రియ తమ పార్టీలోకి రావడం మంత్రి కావడం సంతోషకరమంటూ మిగిలిన విషయాలు దాటేశారు. ఇక శిల్పా సోదరులకు అనేక అవకాశాలిస్తే పాలు తాగి రొమ్ము గుద్దారని తీవ్రంగానే తిట్టిపోశారు.బావ ముఖ్యమంత్రి చంద్రబాబును మర్చిపోకుండా ఒకటికి నాలుగుసార్లు ఆయన నాయకత్వసమర్థత, కష్టాల్లో ఎపిని గట్టెక్కించడం వంటి రెగ్యులర్ మంత్రాలూ చదివారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాల లెక్కలు, స్థానిక అభ్యర్థి పేరువంటివి చెప్పేప్పుడు కూడా కొంత తడ బడ్డారు. అప్పటి ప్రధాని పివి నరసింహారావుపై భూమాను పోటీ పెట్టడానికి అవకాశం వున్నా తెలుగువారు గనక నాన్నగారు మద్దతిచ్చారని బాలయ్య గుర్తు చేశారు. ఏమైనా ఆయన ప్రసంగానికి అక్కడి వారు బాగాస్పందించారు. వేదికపై నాయకులు కూడా ఖుషీ అయ్యారు.