అక్షర లక్షలు అంటూ శ్రీకృష్ణ దేవరాయుల కాలంలో అష్టదిగ్గజాలకు బహుమానాలు అందేవి. ఆ తరవాత కాలంలో రచయితలకు, కవులకు అలాంటి సత్కారాలు దక్కలేదు. టాలీవుడ్లో మాత్రం రచయితలకు ఇప్పుడిప్పుడే డిమాండ్ బాగా పెరుగుతోంది. వాళ్ల ప్రాముఖ్యతని దర్శకులు, హీరోలూ గుర్తిస్తున్నారు కూడా. ఇప్పుడున్న రోజుల్లో ఓ కథ… కోటి రూపాయలు కూడా చేజిక్కించుకోగలదు. అదీ.. రైటర్స్కున్న క్రేజ్. ఈ సంక్రాంతి కి నలుగురు హీరోలు పోటీపడ్డా.. రియల్ హీరోగా పేరు తెచ్చుకొన్నాడు రచయిత బుర్రా సాయిమాధవ్. అటు ఖైదీ నెం.150లోనూ, ఇటు గౌతమిపుత్ర శాతకర్ణిలోనూ అదిరిపోయే డైలాగులు రాశాడు. ముఖ్యంగా గౌతమిపుత్ర కోసం బుర్రా రాసిన డైలాగులు చాలా పాపులర్ అయిపోయాయి.
సమయం లేదు మిత్రమా… అనే డైలాగ్ అయితే ఎలా పడితే అలా వాడేస్తున్నారంతా. బాలయ్య పలికిన సంభాషణలు, శ్రియ నుంచి వినిపించిన డైలాగులు అదిరిపోయాయి. ఈ విజయంలో సంభాషణలు కీలక పాత్ర పోషించాయి. ఆ కష్టం గుర్తించిన నందమూరి బాలకృష్ణ తన రచయిత బుర్రా సాయిమాధవ్ని తగు రీతిలో సత్కరించాలనుకొన్నాడు. అందుకే… ఓ బంగారు గొలుసు బహుమానంగా ఇచ్చాడు. దానికి ఖరీదు రూ.5 లక్షలకు పైమాటే అని తెలిసింది. బుర్రా ఎన్టీఆర్ కుటుఒంబానికి వీరాభిమాని. బాలకృష్ణ చిత్రానికి పనిచేయాలన్నది తన కల. ఆ కల నెరవేరడమే కాదు, బాలయ్య వందో చిత్రానికి సంభాషణ రచయితగా పనిచేసే అవకాశం దక్కింది. ఇప్పుడు బంగారంలాంటి కానుకతో.. తెగ సందడి పడిపోతున్నాడీ రచయిత. `మనం మళ్లీ మళ్లీ కలసి పనిచేద్దాం` అంటూ బాలయ్య మాట కూడా ఇచ్చాడట. దాంతో ఆ ఆనందం మరింత రెట్టింపయ్యింది. బాలయ్య అంటేనే అంత. నచ్చితే ఓ పట్టాన వదలడు. అందుకే అనేది జై.. జై బాలయ్యా అని.