దిల్ రాజు అగ్ర హీరోలందరితోనూ సినిమాలు తీశారు. చిరంజీవి, బాలకృష్ణ మినహా. ఇప్పుడు ఆ లోటు కూడా తీర్చుకొనే ప్రయత్నాల్లో ఉన్నారాయన. ప్రస్తుతానికి బాలకృష్ణతో ఓ సినిమా చేయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం కొన్ని కథలు సిద్ధం చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల దిల్ రాజు బాలయ్య కోసం కొన్ని కథల్ని విన్నారని, అందులో బాలయ్యకు ఏది నచ్చితే ఆ కథతో సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈమధ్య బాలయ్య కథల్ని తనయ తేజస్విని వింటున్నారు. ఆమెకు నచ్చితే.. ఆ కథ బాలయ్య వరకూ వెళ్తోంది. ఈమధ్య బ్రాహ్మణి కొన్ని కథల్ని విన్నారని, అందులో ఒకటి నచ్చిందని, ఇదే కథ బాలయ్యకూ నచ్చితే.. పట్టాలెక్కడం ఖాయమని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే బాలయ్యకు ఇప్పుడు కథ చెప్పిన దర్శకుడు ఎవరన్నది సస్పెన్స్.
Also Read : బాలకృష్ణ.. పవన్.. చెదిరిన ‘కథ’!
నిజానికి దిల్ రాజు బ్యానర్లో బాలకృష్ణ ఎప్పుడో సినిమా చేయాల్సింది. బాలయ్య వందో సినిమా చేయడానికి అప్పట్లోనే దిల్ రాజు గట్టిగా ప్రయత్నించారు. కానీ కుదర్లేదు. ఇన్నాళ్లకు మళ్లీ అవకాశం వచ్చింది. ఈసారి ఎలాగైనా బాలయ్యతో సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. ‘భగవంత్ కేసరి’ బాలయ్యకు 108వ చిత్రం. ఇప్పుడు బాబితో చేసే సినిమా 109. లెక్క ప్రకారం బోయపాటి సినిమా 110. అవుతుంది. 111వ సినిమా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.