హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ… ప్రభుత్వమే ప్రజలకు ఏదో ఒకటి చేయాలని అనుకోలేదు. మరోసారి సొంత డబ్బుతో వారి ఆరోగ్యం కాపాడేందుకు రంగంలోకి దిగారు. కరోనా బారిన పడిన వారందరికీ .. మందులు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక వాహనంలో… ఏయే మందులు కావాలో అన్నీ ప్యాకేజీ చేయించి.. బాక్సుల్లో ఉంచి.. పంపిణీ చేస్తున్నారు. హిందూపురంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. దాదాపుగా రెండు వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాలు పూర్తి స్థాయిలో వైద్యం చేయలేకపోతున్నాయి.
కొద్ది రోజుల క్రితం… హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందకపోవడం.. వెంటిలేటర్ వంటి అత్యాధునిక సౌకర్యాలు లేకపోవడంతో… కొంత మంది రోగులు చనిపోయారు. నిజానికి.. గత ఏడాది కరోనా వచ్చిన సమయంలోనే బాలకృష్ణ… రూ. యాభై లక్షలు సొంత నిధులు పెట్టి వెంటిలేటర్లతో పాటు ప్రభుత్వాసుపత్రికి పలు సౌకర్యాలు కల్పించారు. కానీ వాటిని అధికారులు అమర్చలేదన్న ఆరోపణలు వచ్చాయి. వాటిని ఉపయోగించి ఉంటే.. చాలా మంది ప్రాణాలు కాపాడేవారన్న అభిప్రాయాలు వినిపించాయి.
అయితే.. ఈ సారి ఆస్పత్రికి కాకుండా… నేరుగా రోగులకే సాయం చేయాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మందులను బాక్సుల్లో ప్యాక్ చేసి పంపారు. కరోనా వచ్చిన వారందరికీ.. ఉచితంగా టాబ్లెట్లు ఇస్తామని.. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న అక్కడి టీడీపీ నేతలు చెబుతున్నారు. బాలకృష్ణ ప్రయత్నం.. హిందూపురం కరోనా బాధితుల్లో.. ధైర్యం నింపుతోంది.