ఇండ్రస్ట్రీకి పెద్ద దిక్కయిన టాప్ హీరోల్లో… నందమూరి బాలకృష్ణ ఒకరు. అదేంటో గానీ… బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చినా – బాలయ్య పారితోషికం ఎప్పుడూ హద్దు దాటలేదు. సినిమాల్ని ఒప్పుకోవడంలో కూడా బాలయ్య పంథా వేరు. కథ నచ్చితే, పారితోషికం గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. నిర్మాతలకెప్పుడూ బాలయ్య అందుబాటులో ఉండే హీరోనే. అయితే కెరీర్లో తొలిసారి ఎప్పుడూ లేనంతగా బాలయ్య వెనుక నిర్మాతలు వెంట పడడం ప్రారంభించారు. అఖండ తరవాత వరుసగా రెండు ప్రాజెక్టుల్ని లైన్ లో పెట్టాడు బాలయ్య. అయితే మరో అరడజను అడ్వాన్సులు బాలయ్య చేతిలో ఉన్నట్టు టాక్. ఆ కథలన్నీ సెట్ అయితే దాదాపు మూడేళ్ల పాటు.. బాలయ్య బిజీ.
అఖండ తరవాత.. మైత్రీ మూవీస్ లో ఓ సినిమా చేస్తాడు బాలయ్య. దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేయాలి. సి.కల్యాణ్ ఇప్పటికే బాలయ్యకు అడ్వాన్స్ ఇచ్చాడు. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు బాలయ్యకు ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చారు. రాజ్ కందుకూరి సైతం బాలయ్యతో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇటీవల రాజ్ కందుకూరితో బాలయ్య భేటీ వేశాడని తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో బాలయ్య ఓ సినిమా చేయాలి. ఇవి కాకుండా… నలుగురైదుగురు నిర్మాతలు నిత్యం బాలయ్యతో టచ్లో ఉంటున్నారు. అయితే.. చాలా ప్రాజెక్టులకు కథలింకా సెట్ అవ్వలేదు. అందుకే ఏదీ ఫైనల్ కాలేదు. కొత్త నిర్మాతలు అడ్వాన్సులు పట్టుకుని వస్తుంటే.. బాలయ్య అడ్వాన్స్ తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది.