హిందూపురం నియోజకవర్గంలో హ్యట్రిక్ కోసం పోటీ చేయబోతున్న నందమూరి బాలకృష్ణ.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకూ నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. ద్వితీయ శ్రేణి నేతలే ప్రచారం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓ విడత ప్రచారం ముగించేశారు. చంద్రబాబు అభ్యర్థిత్వాన్ని ప్రకటించి దాదాపుగా నెల అవుతోంది. నారా లోకేష్ హిందూపురంలో ఓ సభను ఏర్పాటు చేసి ఎన్నికలకు టీడీపీ శ్రేణులను సన్నద్ధం చేసి వెళ్లారు. ఆ కార్యక్రమంలో సైతం బాలకృష్ణ పాల్గొనలేదు.
హిందూపురం టీడీపీ నేతల్ని వైసీపీలో చేర్పించేందుకు ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి భారీగాఖర్చు పెడుతున్నారు. ఆయన హిందూపురంలో వైసీపీని గెలిపించడాన్ని సవాల్ గా తీసుకున్నారు. టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉన్న హిందూపురం పట్టణం, చిలమత్తూరు మండలాల్లో భారీగా డబ్బు ఆశ చూపి అయినా టీడీపీ నేతల్ని చేర్చుకుంటున్నారు. వారిని ఆపేవారు లేరు. వైసీపీ అభ్యర్థి మాత్రం రోజూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వైసీపీ హిందూపురం అభ్యర్థి దీపిక, ఆమె భర్త వేణు రెడ్డి ఇద్దరూ ప్రతి రోజు షెడ్యుల్ రూపోందించుకుని చెరొక ప్రాంతంలో ప్రచారం చేస్తున్నారు.
అయితే వైసీపీలో వర్గాలు కలవడం లేదు. నాలుగువర్గాలున్నాయి. ఎవరూ దీపికను సహకరించడం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఇక్లాల్ వైసీపీకి రాజీనామా చేశారు. పరిస్థితి టీడీపీకి అనుకూలంగానే ఉంది. అయితే బాలకృష్ణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకూ.. రాకపోతే.. పార్టీ క్యాడర్ ను వైసీపీ నేతలు ఆకర్షిస్తారని అది ఇబ్బందికరం అవుతుందన్న ఆందోళన.. టీడీపీనేతల్లో కనిపిస్తోంది.