ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ చేతిలో పడ్డాక.. దాని స్వరూప స్వభావాలు మారుతూ వచ్చాయి. బాలకృష్ణ పుట్టిన రోజున విడుదలైన.. ఎన్టీఆర్ లుక్‌తో ఆ విషయం నిజమని స్పష్టమైపోయింది. ఆ లుక్‌పై `మార్ఫింగ్` ముద్ర పడినా… ఎక్కువ రోజులు నిలవలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి మరో లుక్ వచ్చింది. ఎన్టీఆర్ మార్క్ బ్రాండెడ్ పోజ్ అది. ఎన్టీఆర్ అనగానే గుర్తొచ్చే రూపం అది. ఎన్టీఆర్ శిలా విగ్రహాల నమూనా అది. మెడ కొంచెం పక్కకు వండి, ఓ చేయి పైకెత్తి, చిరునవ్వు చిందించే నందమూరి తారకరామారావు రూపమది. అదే… ఇప్పుడు పంద్రాగస్ట్ కానుకగా వచ్చింది. ఒక్క క్షణం ఏమరపాటుగా ఉంటే అది ఎన్టీఆరే అనిపిస్తుంది. అంతలా మాయ చేశారీ చిత్రంలో. ఎన్టీఆర్‌గా బాలయ్య సూట్ అవుతాడా, లేదా? అనే ప్రశ్నలకు దాదాపుగా సమాధానం దొరికేసినట్టే. గ్రాఫిక్స్ మాయాజాలం, ఫొటో షాప్ టెక్నాలజీ వాడుకుంటే వాడుకున్నారు గాక. కానీ… ఆ రూపం మాత్రం అచ్చుగుద్దినట్టు దింపేశారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బసవతారకంగా విద్యాబాలన్, నారా చంద్రబాబు నాయుడు గా రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. రానా సోమవారం నుంచి షూటింగ్లో పాల్గొంటున్నాడు.