ఆ మధ్య ఎప్పుడో బాలయ్య తన 100వ సినిమాగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘ఆదిత్య 999’ చేయబోతున్నట్లు, దానిలో తన కొడుకు మోక్షజ్ఞను పరిచయం చేయబోతున్నట్లు చెప్పారు. కానీ ఆ తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రుద్రాక్ష’ చేయబోతున్నట్లు వార్తలు వచ్చేయి. కానీ అది కూడా నిలిచిపోయిందని తాజా సమాచారం. ఇంతకీ బాలయ్య 100వ సినిమాకి దర్శకుడు ఎవరనే విషయం తెలియడం లేదు.
బాలయ్య తన సినీ జీవితంలో 100వ సినిమా ఒక గొప్ప మైలురాయిగా ఉండిపోవాలని కోరుకోవడం సహజమే కానీ దాని గురించి మరీ ఎక్కువ ఆలోచిస్తే చివరికి ఆయన సినిమా పరిస్థితి కూడా చిరంజీవి 150 సినిమాలాగే తయారవుతుంది. చిరంజీవి రాజకీయాల నుండి సినీ పరిశ్రమకు తిరిగి వచ్చిన తరువాత, తన 150వ సినిమా గురించి మరీ అతి జాగ్రత్తలు తీసుకోవడం వలన, దానిపై మీడియాలో మరీ అతిగా చర్చ జరగడం వలన, ఆయన అభిమానులలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అవి ఎంతగా పెరిగిపోయాయి అంటే ఆయన అందుకోలేనంత. అది చూసి కంగారుపడి ఆయన తన కొడుకు రామ్ చరణ్ తేజ్ నటించిన ‘బ్రూస్లీ’ సినిమాలో నటించేసి దానినే తన 150వ సినిమాగా చెప్పుకోవలసి వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు అది ఫ్లాప్ అవడంతో తండ్రి, కొడుకులిద్దరికీ అది చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ ఒత్తిడి కారణంగానే చిరంజీవి తను తీయలనుకొన్న తమిళ రీమేక్ ‘కత్తి’ ని ప్రారంభించడానికి ఇంకా సమయం తీసుకొంటున్నారని భావించవచ్చును.
ఇదంతా ఎందుకు చెప్పుకోవడమంటే ఇంతవరకు ముందు వెనుకా చూడకుండా 99 సినిమాలు చాలా దైర్యంగా చేసిన బాలయ్య తన 100వ సినిమా కోసం చిరంజీవిలాగ చాలా అతి జాగ్రత్తలు తీసుకొంటూ జాప్యం చేస్తున్న కొద్దీ దానికి అనవసరమయిన హైప్ క్రియేట్ చేసుకొన్నట్లవుతుంది. అప్పుడు చిరంజీవి 150 సినిమాలాగే దానిపై కూడా అభిమానులలో అంచనాలు బారీగా పెరిగిపోతాయి. అప్పుడు ఆయన కూడా చిరంజీవిలాగే ఇబ్బంది పడవలసి వస్తుంది. కనుక 100వ సినిమాని కూడా ఆయన మరో కొత్త సినిమాలాగా మాత్రమే భావించి వీలయినంత త్వరగా మొదలుపెడితే ఈ ఇబ్బందులన్నీ తప్పుతాయి.