అయిదు పదులు దాటిన వయసు నందమూరి బాలకృష్ణది. సినిమాలతో సెంచరీ కొట్టాడు. ఓ పక్క రాజకీయాలతో బిజీ. మరోవైపు బసవతారకం ఆసుపత్రి పర్యవేక్షణ కూడా ఆయనదే. అయినా.. ఆ స్పీడు తగ్గలేదు. 100 వ సినిమా అయ్యిందో లేదో… వెంటనే 101వ చిత్రాన్ని మొదలెట్టేశాడు. ఆ సినిమాకి గుమ్మడికాయ కొట్టిన మరుసటి రోజే తన 102వ సినిమానీ మొదలెట్టేశాడు. బాలకృష్ణ కెరీర్ మాంఛి ఊపులో ఉన్నప్పుడు ఎంత జోరు చూపించాడో.. ఇప్పుడూ అంతే. మరో కథ సిద్ధం చేసి ఎవరైనా చెప్పాలే గానీ – దాన్నీ పట్టాలెక్కించేయడానికి బాలయ్య సిద్ధమే. సంక్రాంతికి తన 102వ సినిమా విడుదల చేయాలన్న సంకల్పంతో ఉన్నాడంటే.. బాలయ్య ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ పూర్తి చేయాలి. ఈ వయసులో.. ఈ జోరు కేవలం బాలయ్యకే సాధ్యం.
బాలయ్యతో పాటు తెలుగు చిత్రసీమకు మూల స్థంభాలుగా చెప్పుకొనే నాగార్జున, వెంకటేష్, చిరంజీవిలతో పోలిస్తే.. స్పీడులో బాలయ్యే ముందుంటాడు. వెంకటేష్ ‘గురు’ తరవాత మరో సినిమా చేయలేదు. కథలు లేకో.. అవకాశాలు రాకో కాదు. తనకు సినిమాలపై మూడ్ రావాలంతే. వయసు పైబడిన ప్రభావంతో ఆచి తూచి స్పందిస్తున్నాడు. నాగార్జున కూడా అంతే. సినిమా సినిమాకీ గ్యాప్ ఉంటుంది. మధ్యలో తనయుల కెరీర్ చూసుకోవాల్సివస్తోంది. అందుకే నాగ్ కెరీర్ నుంచీ స్పీడ్ ఆశించలేం. చిరంజీవి గురించి ఇక చెప్పేదేముంది? 150వ సినిమా చేయాలా, వద్దా అనేది తేల్చుకోవడానికే నాలుగేళ్లు పట్టింది. 151వ సినిమా ఎనౌన్స్ చేసి ఇంతకాలమైనా, ఒక్క అప్డేట్ కూడా లేదు. ఈనెలలో మొదలవుతుంది. అది పూర్తయ్యేటప్పటికి ఏ కాలం అవుతుందో..!
అయితే బాలయ్య మాత్రం స్పీడు స్పీడుగా ఉన్నాడు. ఇది వరకటి జోష్ చూపిస్తున్నాడు. పెద్ద హీరోలు, మహేష్, ఎన్టీఆర్ తరం వాళ్లు బాలయ్యని చూసి నేర్చుకోవాల్సిందే. పెద్ద హీరోలు వరుసగా సినిమాలు చేస్తుంటే ఆ మాజానే వేరు. బాక్సాఫీసుకీ కొత్త కళ వస్తుంది. గ్యాప్‌లు ఉండాల్సిందే. అయితే మరీ సుదీర్ఘవిరామాలు తీసుకొని, రెండేళ్లకు ఓ సినిమా చేస్తూ.. ఆ సినిమాపై పెరిగిన అంచనాల్ని అందుకోలేక చతికిల పడుతూ ప్రయాణం సాగించడం కంటే.. యేడాదికి రెండు మూడు సినిమాలు చేసుకొంటూ వెళ్లిపోవడం బెటర్. ఈ విషయంలో బాలయ్యే అందరికీ ఆదర్శం కావాలి.