ఎప్పుడో ఎనభైల్లో ఎన్టీఆర్ చేసారు ‘లాయర్ విశ్వనాధ్’ అంటూ ఓ సినిమా. రెగ్యులర్ పాట్రన్ మాదిరిగా కాకుండా, పూర్తి స్థాయి లాయర్ క్యారెక్టర్ లో. నందమూరి నట వారసుడు బాలయ్య కూడా ఇప్పుడు అలాంటి సినిమా ఒకటి చేయబోతున్నారు. హిందీ లో హిట్ అయిన పింక్ సినిమా ఆధారంగా తమిళంలో తయారైంది నెర్కొండ పర్వాయ్ సినిమా. తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరో. ఈ సినిమా మీద అక్కడ మంచి అంచనాలు వున్నాయి.
రెండు రోజుల క్రితం ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు వెళ్లి చూసి వచ్చారు. బాలకృష్ణ ఓకె అంటే ఈ సినిమాను తెలుగులో చేయాలన్నది దిల్ రాజు సంకల్పంగా తెలుస్తోంది. దిల్ రాజుకు ఇండస్ట్రీలో ప్రతి హీరోతో సినిమా చేసాను అని అనిపించుకోవాలని కోరిక వుంది. అందుకే బాలయ్యతో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇప్పుడు సరైన సబ్జెక్ట్ దొరికింది.
తమిళ సినిమా దిల్ రాజుకు బాగా నచ్చినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన టైటిల్ కూడా డిసైడ్ చేసుకున్నారు. ‘లాయర్ సాబ్’ అన్నది టైటిల్. బాలయ్యతో ఓ సిటింగ్, ఆయన ఓకె అనడం తరువాయి. ఈ సినిమా అనౌన్స్ మెంట్ వస్తుంది.
ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, తెలుగు పింక్ అయిన లాయర్ సాబ్ కు దిల్ రాజు నిర్మాణ భాగస్వామి ఎవరో కాదు. దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్. ప్రస్తుతం ఆయనే ఎఫ్ 2 సినిమాకు బాలీవుడ్ లో దిల్ రాజకు నిర్మాణ భాగస్వామిగా వున్నారు. ఈ భాగస్వామ్యాన్ని తెలుగులోకి కూడా విస్తరించనున్నారు ‘లాయర్ సాబ్’ సినిమా ద్వారా.