బాలయ్య లెక్కలు వేరేలా ఉంటాయి. హిట్టు, ఫ్లాపు ట్రాకుని ఆయన అస్సలు పట్టించుకోడు. మనిషి నచ్చాలి. అంతే. బాలయ్య ఇప్పటి వరకూ దర్శకులకు అలానే అవకాశాలు ఇస్తూ వెళ్లాడు. ఇప్పుడు మరో ఫ్లాప్ దర్శకుడికి బాలయ్య ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు.. పరుచూరి మురళి.
బాలయ్యతో ‘అధినాయకుడు’ సినిమా తీశాడు మురళి. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు బాలయ్య మరోసారి మురళిపై నమ్మకం ఉంచాడు. తనతో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఓ ఫ్లాప్ ఇచ్చినా, మురళి బాలయ్య మనసు గెలుచుకోవడానికి ఓ బలమైన కారణం ఉంది. అదే.. రూలర్ సినిమా.
ఈ సినిమా కథని పరుచూరి మురళినే రాశాడు. మురళి దగ్గర ఓ మంచి కథ ఉందని తెలియగానే ‘ఆ కథ నాకు కావాలి..’ అని బాలయ్య అడగడం, దాన్ని బాలయ్యకు ఇచ్చేయడం జరిగిపోయాయి. ఓ దర్శకుడు అయ్యుండి, మరో దర్శకుడికి కథ ఇచ్చేయడం బాలకృష్ణకు నచ్చింది. అందుకే ‘నీతో ఓ సినిమా చేస్తా’ అని బాలయ్య మాటిచ్చాడట. ఈ చిత్రానికి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది.