బాలకృష్ణ – బోయపాటి శ్రీనులది తిరుగులేని కాంబినేషన్. వీరిద్దరి కలయికలో సింహా, లెజెండ్, అఖండ.. వచ్చాయి. ఒకదాన్ని మించి మరోటి విజయాన్ని అందుకొన్నాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. అది అయిన వెంటనే.. బోయపాటి తో ఓ సినిమా ఉండబోతోంది. 2024 ఎన్నికలకు ఉపయోగపడేలా బోయపాటి శ్రీను సినిమాని డిజైన్ చేయాలన్నది అభిమానుల ఆశ. బోయపాటి కూడా అలాంటి లైన్ సిద్ధం చేశాడట.
కానీ బాలయ్య మనసులో మాత్రం అఖండ కి సీక్వెల్గా అఖండ 2 తీయాలని ఉందట. అఖండలో మాస్ అంశాలతో పాటు.. ఎలివేషన్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటుగా హిందూ ధర్మం, దాన్ని కాపాడవలసిన ఆవశ్యకత అంతర్లీనంగా చర్చించారు. ఆయా సన్నివేశాలు అభిమానులకు నచ్చాయి. ప్రస్తుతం దేశమంతట రూపొందుతున్న చిత్రాల్లో హిందుత్వం అనేది మంచి సెల్లింగ్ పాయింట్ గా మారింది. దాన్ని బలంగా చెబితే కాసుల వర్షం కురుస్తుంది. పైగా అఖండ కథలోనే సీక్వెల్ కి బీజం వేశారు. అందుకే అఖండ 2 వైపుగా ఆలోచించాలని బోయపాటికి సూచించినట్టు టాక్. దీనిపైనే ప్రస్తుతం కసరత్తులు జరుగుతున్నాయి. ప్రస్తుతం రామ్ తో ఓ సినిమా చేస్తున్నాడు బోయపాటి. అది పూర్తయిన వెంటనే బాలయ్య స్క్రిప్టు పనులు ముమ్మరం చేస్తాడు.