తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు… నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, దగ్గుబాటి రామానాయుడు హైదరాబాద్లో సినిమా స్టూడియోలు నిర్మించారు. అప్పట్లో అవిభక్త ఆంధ్రప్రదేశ్ సినీ ప్రముఖులకు ఆహ్వానం పలికింది. అదే రీతిలో చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో స్టూడియోలు నిర్మించమని ఆహ్వానాలు పలుకుతోంది. అందుకోసం విశాఖలోని భీమిలి బీచ్ రోడ్డులో గతంలోనే 316 ఎకరాలు కేటాయించారు. ఇప్పటికే నటుడు బాలకృష్ణ ఏపీ ప్రభుత్వానికి స్టూడియో నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని, త్వరలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా స్టూడియో నిర్మాణానికి శంఖుస్థాపన జరగనుందని తెలిసింది.
ఏవీయం సంస్థ కూడా స్టూడియో నిర్మాణానికి ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. ఈ స్టూడియోల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వమే ప్రోత్సహకాలు ఇవ్వనుంది. స్టూడియో నిర్మించాలనుకునే వారికి ఎకరం రూ. 50 లక్షల చొప్పున కేటాయిస్తున్నారు. ఈ ధర ఎక్కువగా వున్నందున ప్రభుత్వ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరుతున్నారు. ఇప్పటికే విశాఖలో రామానాయుడు ఓ స్టూడియో నిర్మించారు. అదీ రాష్ట్రం రెండుగా విడిపోకముందు. ప్రస్తుతం ఆయన తనయుడు, నిర్మాత సురేష్ బాబు ఆ స్టూడియో వ్యవహారాలు చూస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్న నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎంతమంది స్టూడియోల నిర్మాణానికి ముందడుగు వేస్తారో చూడాలి!!