నందమూరి బాలకృష్ణ అంటే ఆయన తీరు చూసిన వారు బయట కూడా చాలా సీరియస్‌గా ఉంటారేమో అని అనుకుంటూ ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమలో తరాలుగా ఉన్న పెద్ద కుటుంబానికి చెందిన అగ్రహీరో కావడంతో ఆయనంటే పరిశ్రమకుచెందిన వ్యక్తులందరూ కూడా చాలా భయభక్తులతో మెలగుతూ ఉంటారు. అయితే బాలకృష్ణ మాత్రం చాలా యూజర్ ఫ్రెండ్లీ టైపు అని అప్పుడప్పుడూ బహిరంగ కార్యక్రమాల్లో నిరూపించుకుంటూ ఉంటారు. ఆదివారం నాడు హైదరాబాదు మాధాపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ తనకు అస్సలు పరిచయం లేని అక్కడి అందరితోనూ చాలా కలివిడిగా గడపడమే ఆయన గురించి అందరూ ఇలా వ్యాఖ్యానించుకోవడానికి కారణం.
మాధాపూర్ లో మెరిడియన్ స్కూలు పక్కన ‘ది స్ట్రీట్’ గేమ్స్ అండ్ ఫుడ్స్ క్లబ్ ఒకటి కొత్తగా ఏర్పాటు అయింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ క్లబ్ ప్రారంభోత్సవానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాదులో విద్యార్థిగా తాను చదువుకునే రోజులనాటి అనుభవాలను నెమరువేసుకున్నారు. అప్పట్లో తాను చాలా ఆటలు ఆడేవాడినని ఎక్కువగా ఫుట్ బాల్ ఆడేవాడినని ఆయన అప్పటి ముచ్చట్లు షేర్ చేసుకున్నారు.
తన ప్రసంగం తర్వాత బాలకృష్ణ ఈ కార్యక్రమం వద్ద సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘ సమయం గడపడం విశేషం. కార్యక్రమానికి వచ్చిన యూత్ అందరితోను, తనను అడిగిన ప్రతి ఒక్కరితోనూ కలిసి ఫోటోలు, సెల్ఫీలు దిగుతూఆయన సందడి చేశారు. బాలయ్య వెళ్లిపోయాక అక్కడి జనం మాత్రం.. నందమూరి బాలకృష్ణ మరీ చాలా సీరియస్ కేరక్టర్ అనుకున్నామే.. మరీ అంత యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నారే గ్రేట్ అంటూ కామెంట్లు రువ్వడం కొసమెరుపు.