గౌతమీపుత్ర శాతకర్ణి విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అంచనాలు పెరుగుతున్నాయి. మరోవైపు బాలకృష్ణ బిజీ బిజీగా ఉన్నారు. ఆయన ఇవాళ ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీర్ ను కలిశారు. తన సినిమాకు వినోద పన్ను రద్దు చేయాలన్న బాలయ్య కోరికను కేసీఆర్ మన్నించారు. ఇందుకు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. వినోద పన్ను రద్దు చేసినందుకు బాలయ్య ధన్యవాదాలు తెలిపారు.
గౌతమీపుత్ర… సినిమా ప్రత్యేక ప్రదర్శనకు రావాలంటూ కేసీఆర్ ను ఆహ్వానించారు. ఈనెల 12న హైదరాబాద్ లో జరిగే స్పెషల్ షోకు వస్తానని కేసీఆర్ అంగీకరించారని బాలయ్య మీడియాకు తెలిపారు. ఈ సినిమా ఓపెనింగ్ కు కూడా కేసీఆర్ ను ఆయన ఆహ్వానించారు. కేసీఆర్ ఆ ఆహ్వానాన్ని మన్నించి అన్నపూర్ణ స్టుడియో వెళ్లారు. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఒక సినిమాకు వినోద పన్ను రద్దు చేయడం అంటే నిర్మాతకు అది చాలా ఉపశమనం. పన్ను భారం లేకుండా స్వేచ్ఛగా విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. గతంలో పన్ను మినమాయింపు ఇచ్చిన సినిమాలను కూడా నామమాత్రపు చార్జీలకే ప్రదర్శించే వారు. పన్ను సంగతి ఎలా ఉన్నా సంక్రాంతి బరిలో పందెం కోడిలా దూసుకు వస్తున్న బాలయ్య సినిమా ఎన్నో సంచలనాలు సృష్టిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. చాలా కాలం తర్వాత బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు సంక్రాంతి సమయంలో ప్రేక్షకులకు వినోదం పంచడానికి పోటీ పడుతున్నాయి. అభిమానులకు కన్నుల పండుగే.