బడ్జెట్ తగ్గించుకోవడం ఎలా? అనే విషయంలో బాలకృష్ణ చిత్రబృందం తర్జన భర్జనలు పడుతోంది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బాలయ్య – బోయపాటి ఇద్దరూ కలిసి దాదాపు 25 కోట్ల పారితోషికం పంచుకున్నారు. సినిమా బడ్డెట్ దాదాపు 60 కోట్లు. మిగిలిన వాళ్ల పారితోషికాలు తగ్గించి, మేకింగ్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టాలన్నది బోయపాటి భావన. అందుకే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నా – స్టార్స్ జోలికి పోలేదు. ప్రయాగ మార్టిన్ అనే ఓ కొత్తమ్మాయిని ప్రధాన కథానాయికగా తీసుకున్నారు. ఇప్పుడు పూర్ణ వచ్చింది. పూర్ణకి ఈసినిమా నిమిత్తం ఇస్తున్న పారితోషికం అక్షరాలా 12 లక్షలని సమాచారం. ప్రయాగకి 20 లక్షలు ఇచ్చార్ట. అంటే.. ఇద్దరు హీరోయిన్లకు కలిపి 32 లక్షల్లో తేల్చేశారు. అదే… స్టార్ హీరోయిన్ల జోలికి వెళ్తే… ఎవరిని ఎంచుకున్నా కనీసం కోటిన్నర సమర్పించుకోవాలి. మరో హీరోయిన్ కి ఎంత కాదన్నా 50 లక్షలు ఇచ్చుకోవాలి. అంటే.. హీరోయిన్లకు 2 కోట్లన్నమాట. ఈ విషయంలో చిత్రబృందం 1.6 కోట్లని ఆదా చేసినట్టే. కాకపోతే స్టార్ హీరోయిన్లుంటే ఆ కాంబో వేరుగా ఉంటుంది. వాళ్లు లేని లోటుని ఈ ప్రయాగ, పూర్ణలు ఎంత వరకూ తీరుస్తారో మరి! అన్నట్టు… ఈరోజు నుంచి హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ పునః ప్రారంభం కానుంది. ఈ రోజే పూర్ణ కూడా సెట్లో అడుగుపెట్టబోతోందని సమాచారం.