దాదాపు ఏణ్ణర్ధం కాలంగా వార్తల్లో నలుగుతూ వస్తొంది బోయపాటి-బాలయ్య సినిమా. బౌండ్ స్క్రిప్ట్ కళకళ లాడుతూ బరువుగా రెడీగా వుందని, కొబ్బరికాయ సిద్దంగా వుందని, కొట్టేయడం తరువాయి అని ఒకటే ఫీలర్లు. ఎన్నికల ముందు వచ్చేది ఆ సినిమానే అని, బాలయ్య ఇమేజ్ ను ఆకాశం అంత ఎత్తుకు పెంచేలా బోయపాటి భయంకరమైన సబ్జెక్ట్ రెడీ చేసాడని మరి కొన్ని ఫీలర్లు.
కానీ, కట్ చేస్తే, ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలైంది. బాలయ్యకు సమయం కుదరలేదు. బోయపాటి ఖాతాలో ఓ భయంకరమైన డిజాస్టర్ వచ్చి పడింది. బోయపాటి తన సినిమాకు 70 కోట్లు బడ్జెట్ చెప్పాడని, స్వంతంగా నిర్మించాలనుకున్న బాలయ్య బడ్జెట్ సంగతి తరువాత స్క్రిప్ట్ చెప్పమని అడిగారని వదంతులు వినిపించడం ప్రారంభమైంది.
ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ తెలుగునాట, ఓవర్ సీస్ లో బయ్యర్లను నిలువునా ముంచేసింది. ఇప్పటికి ఇంకా ఒక్కరంటే ఒక్క బయ్యర్ కూడా తేరుకోలేదు. అంత దారుణంగా నష్టపోయారు. ఇలాంటి టైమ్ లో బోయపాటి – బాలయ్య సినిమాకు రెండు సమస్యలు. బోయపాటి ఇంకా చూపించని స్క్రిప్ట్ ను నమ్మి 70 కోట్లు పెట్టడం అన్నది ఓ సమస్య. ఎందుకంటే ఇది బాలయ్య స్వంత సినిమా. అలాగే ఎన్టీఆర్ సినిమా మిగిల్చిన గాయం పచ్చిగా వుండగానే బోయపాటి సినిమా రెడీ చేస్తే, బయ్యర్లు కాస్తయినా గగ్గోలు పెడతారు. మళ్లీ అడ్జస్ట్ మెంట్ లు వగైరా వ్యవహారాలు వుంటాయి.
అందువల్ల స్వంత ప్రాజెక్టును పక్కన పెట్టి వేరే సినిమా చేస్తే ఏ గొడవా లేదు. ఫైగా సి కళ్యాణ్ ఎప్పటి నుంచో ఆఫీసు కూడా తీసుకుని రెడీగా వున్నారు. వివి వినాయక్ చేత కథల వంటకం చేయిస్తూ వస్తున్నారు కానీ సెట్ కావడం లేదు. అందుకే కేఎస్ రవికుమార్ ను తెచ్చారు. ప్రాజెక్టు ఫైనల్ చేసుకున్నారు.
ఇప్పుడు బయ్యర్లతో ఏ గొడవా లేదు. బోయపాటి సినిమాకు 70కోట్ల పెట్టుబడి పెట్టే పనీ లేదు. ఆగస్టు నుంచి బోయపాటి సినిమా అన్నది ఊరడింపు మాట తప్ప వేరు కాదు. మూడు నెలల్లో కెఎస్ రవికుమార్ సినిమా పూర్తి కావాలి కదా? అప్పటికి రాజు ఎవరో? మంత్రి ఎవరో?
ప్రస్తుతానికి అయితే బోయపాటికి బర్త్ డే గిఫ్ట్ ఇలా అందింది. ప్రశాంతగా కథలు తయారుచేసుకుంటూ కూర్చోవడమే. ఎందుకంటే బోయపాటికి డేట్ లు ఇచ్చే హీరో ఎవరూ ఇప్పుడు లేరు. ఎందుకంటే ఆయన గత సినిమాలు రెండు మూడు నిర్మాతలనో, బయ్యర్లనో నిలువునా ముంచేసినవే కదా?