మాస్ కమర్షియల్ సినిమాలు తీయడంలో సిద్దహస్తుడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ తో తన తడాఖా చూపించాడు. అయితే ఆ తరవాత ఆ స్థాయి విజయం దక్కలేదు. ఇటీవల మిస్టర్ బచ్చన్ చేశాడు. కానీ అది ఫ్లాప్. బాలకృష్ణతో ఓ సినిమా చేస్తానని ఎప్పటి నుంచో చెబుతున్నాడు హరీష్. అది ఎట్టకేలకు ఫిక్సయ్యింది. ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం.. బాలయ్యకు ఓ కథ వినిపించాడు హరీష్. అది బాలయ్యకు నచ్చింది. కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. ప్రస్తుతం యశ్ హీరోగా ‘టాక్సిక్’ చిత్రాన్ని రూపొందిస్తోంది ఈ సంస్థే. ఇప్పుడు తెలుగులోనూ ఓ సినిమా చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి.
హరీష్ శంకర్ పై రీమేక్ దర్శకుడన్న ముద్ర ఉంది. ఆయన సినిమాల్లో ఎక్కువ శాతం రీమేకులే. సూపర్ హిట్టయిన గబ్బర్ సింగ్, ఫ్లాప్ అయిన మిస్టర్ బచ్చన్ రీమేక్ కథలే. అయితే ఈసారి బాలయ్య కోసం కొత్తగా ఓ కథ రాశాడని సమాచారం. రీమేక్ జోన్లోంచి బయటకు రావడానికి, హిట్ బాట పట్టడానికి హరీష్ దగ్గరున్న మంచి అవకాశం ఇది. పైగా బాలకృష్ణ భీకరమైన ఫామ్ లో ఉన్నారు. ఆయన పట్టిందల్లా బంగారమైపోతోంది. ఇంతకంటే హరీష్‌కు మంచి టైమింగ్ దొరకదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన డీటైల్స్ బయటకు వస్తాయి.