తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పటికే గ్రౌండ్ లెవల్లో తమ పనులు ప్రారంభించేసుకున్నారు. మంగళగిరి నుంచి ఈ సారి ఎమ్మెల్యేగా గెలవాలని పట్టుదలగా ఉన్న లోకేష్‌తో పాటు హిందూపురం నుంచి హ్యాట్రిక్ కొట్టాలని టార్గెట్ పెట్టుకున్న బాలకృష్ణ కూడా ఒక రకమైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లు వరుసగా ప్రారంభిస్తున్నారు. వీటి వద్ద ఎప్పుడూ జనం ఉంటున్నారు. ఇక కొత్తగా ఆరోగ్య రథాలు కూడా ప్రారంభిస్తున్నారు.
నియోజకవర్గం మొత్తం మీద మూడు ,నాలుగు ఆరోగ్య రథాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ రోజూ ఒక్కో గ్రామానికి వెళ్లి ఆ గ్రామంలో వారికి ఉచితంగా వైద్యసేవలు అందిస్తారు. మందులు ఇస్తారు. పెద్ద సమస్య ఉంటే పెద్ద ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. అక్కడా తక్కువ ఖర్చుతో వైద్యం అందే ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళగరిలో ఇప్పటికే ఈ సేవలు జోరుగా సాగుతున్నాయి. గ్రామాల్లో పీహెచ్‌సీలు సరిగ్గా పని చేయడం లేదు. మందులు ఉండటం లేదు. ఈ కారణంగా టీడీపీ ఆరోగ్య రథాలకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది.
మంగళగిరి వ్యూహాన్నే హిందూపురంలోనూ బాలకృష్ణ అమలు చేస్తున్నారు. అక్కడ ప్రజలకు వైద్య సేవలు అందించడానికిఓ రథం సిద్ధమయింది. మరో రెండు, మూడింటిని త్వరలోనే పంపించే అవకాశం ఉంది. ప్రజల ఆకలి, ఆరోగ్య అవసరాలు తీర్చే విషయంలో టీడీపీ నేతలు ప్రజల మన్ననలు పొందుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందేవని… ఈ ప్రభుత్వం అంతా నిర్వీర్యం చేసిందని.. అందుకే తాము చేపడుతున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ వ్యూహం వర్కవుట్ అయ్యేలా కనిపిస్తోంది.