తన సినిమాకి ముందు టైటిల్ ఫిక్స్ చేసి, ఆ తరవాత కథ రాసుకోవడం పూరి జగన్నాథ్‌కి అలవాటు. అయితే.. ఈసారి టైటిల్ విషయంలో కాస్త ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు పూరి. అందుకే బాలకృష్ణ సినిమా ఎనౌన్స్ చేసి ఇన్ని రోజులైనా.. టైటిల్ ఏంటన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. టపోరి అనే పేరు ఆమధ్య చక్కర్లు కొట్టింది. పోకిరి.. సౌండింగ్లో ఉంది కాబట్టి పూరి ఈ టైటిల్‌పై మక్కువ చూపిస్తున్నాడని చెప్పుకొన్నారు. అయితే.. టపోరి పేరు పరిశీలనలో లేదని చిత్రబృందం తేల్చేసింది. ఇప్పుడు మరో టైటిల్ బయటకు వచ్చింది. అదే.. ఉస్తాద్!
బాలయ్య ఈసారి ఉస్తాద్‌గా కనిపించడం ఖాయమని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి. పూరి ఈ టైటిల్‌ని రిజిస్టర్ కూడా చేయించేశాడట. బాలయ్యకీ ఈ టైటిల్ బాగా నచ్చిందని, దాదాపుగా ఇదే ఫిక్సయిపోవొచ్చని తెలుస్తోంది. ఇదో గ్యాంగ్ స్టర్ కథ అని పూరి హింటిచ్చేశాడు. ఓ హాలీవుడ్ సినిమా ఆధారంగా కథ తయారు చేసుకొన్నారని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ కథే… పూరి టేకప్ చేస్తే దానికి ఉస్తాద్ అనే టైటిల్ నూటికి నూరు శాతం పక్కాగా కుదిరిపోతుందంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. బాలయ్యకు మూడక్షరాల టైటిల్స్ కూడా బాగానే వర్కవుట్ అయ్యాయి. పూరీకీ ఈ సెంటిమెంట్కలసి వచ్చింది. మరి.. ఉస్తాద్ ఏం చేస్తాడో చూడాలి.