‘అరవింద సమేత వీర రాఘవ’ ఆడియో ఫంక్షన్ విషయంలో ఓ వార్త హల్ చల్ చేసింది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రానున్నాడని, ఈ కలయికతో… ఎన్నో సమీకరణాలు మారిపోతాయని చెప్పుకున్నారంతా. నందమూరి అభిమానులు కూడా `నిజమేనేమో` అని నమ్మారు కూడా. బాబాయ్ – అబ్బాయ్ మధ్య ఓ కోల్డ్ వార్ నడుస్తోందన్న సంగతి దాదాపుగా ప్రతీ నందమూరి అభిమానికీ తెలుసు. వీరిద్దర్నీ కలిపి చూడాలన్నది అభిమానుల కల. అది కష్టమన్న సంగతీ వాళ్లకు తెలుసు. కాకపోతే నందమూరి హరికృష్ణ మరణానంతరం, బాబాయ్ – అబ్బాయ్‌లకు సంబంధించి ఓ వీడియో బయటకు వచ్చింది. భోజనాల వేళ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లతో కలసి బాలయ్య ముచ్చటిస్తున్న ఆ వీడియో హల్ చల్ చేసింది. దాన్ని పట్టుకుని బాబాయ్ – అబ్బాయ్‌ల మధ్య గొడవలు సద్దుమణిగి పోయాయని, త్వరలోనే వీళ్లు కలబోతున్నారని, ఈ కలయికకు నారా చంద్రబాబు నాయుడు మూల సూత్రధారి అని వార్తలు పుట్టాయి. అక్కడితో ఆగలేదు. ‘అరవింద సమేత వీర రాఘవ’కు బాలయ్య ముఖ్య అతిథిగా రాబోతున్నాడని, తండ్రి మరణానంతరం ‘నేనున్నా’ అనే భరోసా ఎన్టీఆర్ బ్రదర్స్‌కి ఇవ్వబోతున్నాడని చెప్పారు.
అయితే అదంతా ఉత్తిదే అని తేలిపోయింది. అబ్బాయ్ ఫంక్షన్‌కి బాబాయ్ రావడం లేదు, అసలు ఈ ఫంక్షన్‌కి అతిథులే లేరు.. అని తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే నిజం అవుతోంది. మంగళవారం జరగబోయే ‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు అతిథులెవరూ లేరు. కేవలం చిత్రబృందం మాత్రమే ఈ వేడుకలో పాలు పంచుకుంటోంది. దాంతో బాలయ్య అభిమానుల ఎదురు చూపులు ఫలించలేదు. అసలు బాబాయ్ – ఎన్టీఆర్ మధ్య సయోధ్య కుదిరిందన్న వార్తలోనే నిజం లేదని తేలిపోయింది. హరికృష్ణ మరణానంతరం ఆ కార్యక్రమాలన్నీ ముగిసిన తరవాత అసలు బాలయ్య, ఎన్టీఆర్ మధ్య ఎలాంటి సంప్రదింపులూ జరగలేదని, బాలయ్య పరామర్శల్ని కేవలం అప్పటికే పరిమితం చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ చంద్రబాబు అడిగితే… తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయడానికి ఎన్టీఆర్ వస్తాడేమో అని, నిజానికి రాజకీయాలు, ప్రచారం విషయంలో ఎన్టీఆర్ అంత ఉత్సాహం చూపించడం లేదని ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్నారు.
ఎన్టీఆర్ మాత్రమే కాదు. కల్యాణ్రామ్దీ అదే థియరీ. ఇటీవల కల్యాణ్ రామ్ రాజకీయ రంగప్రవేశం చేస్తారని వార్తలు గుప్పుమన్నాయి. నిజానికి కల్యాణ్‌రామ్‌కి ఆ ఉద్దేశ్యమే లేదని ఆయన కాంపౌండ్ వర్గాలే చెబుతున్నాయి. కల్యాణ్ రామ్‌కి సినిమాలే కాదు, వ్యక్తిగతంగా కొన్ని వ్యాపారాలున్నాయి. ఆయన దృష్టి వాటిపైనే ఉందని, రాజకీయాల విషయంలో కల్యాణ్ రామ్ ఎప్పుడూ సైలెంటే అని, ఇక మీదటా అదే వైఖరి కొనసాగిస్తారని చెబుతున్నారు.
సో.. ఈ నందమూరి హీరోల మధ్య దూరం అనేది ప్రస్తుతానికి అలానే ఉంది. భవిష్యత్తులో ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే తప్ప.. ఈ `కూటమి`ని కలిసికట్టుగా చూడలేం. అది సినిమా వేడుక అయినా.. రాజకీయ రంగమైనా.