అయ్యప్పనుమ్ కోషియుమ్.. – ఈ మలయాళ చిత్రం తరచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది. హారిక హాసిని సంస్థ ఈ సినిమా రీమేక్ హక్కుల్ని తీసుకుంది. అది బాలకృష్ణ కోసమే అనే వార్త బాగా చక్కర్లు కొట్టింది. రెండో కథానాయకుడిగా రానాని ఎంచుకున్నారని చెప్పుకున్నారు. రెండో కథానాయకుడిగా రానా ఉన్నా లేకున్నా, ఈ సినిమా మాత్రం బాలకృష్ణ చేయడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి బాలయ్యతోనే ఈ సినిమా చేయాలని హారిక హాసిని సంస్థ భావించింది. కాకపోతే ఈ కథ బాలయ్యకు సెట్ అవ్వదన్న అభిప్రాయానికి వచ్చిందిప్పుడు. బాలకృష్ణ కూడా ఈ సినిమా రీమేక్‌పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదని, దాంతో… మరో అగ్ర కథానాయకుడితో ఈ సినిమా చేయబోతున్నారని సమాచారం. ఆ కథానాయకుడ్ని వెదికే బాధ్యత ఇప్పుడు సురేష్ బాబు తీసుకున్నారట. ఎప్పుడైతే ఈ ప్రాజెక్టులోకి రానా ఎంట్రీ ఇచ్చాడో, అప్పుడే సురేష్ ప్రొడక్షన్స్ కూడా హారికతో చేతులు కలిపింది. ఇప్పుడు సురేష్ బాబునే ఈ ప్రాజెక్టు డీల్ చేస్తున్నారు. వెంకటేష్ కి ఈ కథ సెట్టవుతుందని సురేష్ బాబుకి కొంతమంది సలహాలు ఇస్తున్నట్టు టాక్. ఎప్పటి నుంచో వెంకీ – రానా కాంబోలో ఓ సినిమా తీయాలని సురేష్‌బాబు కూడా భావిస్తున్నారు. కాకపోతే.. ఈ సినిమాని వెంకీతో చేయడం పట్ల సురేష్ బాబు సుముఖత వ్యక్తం చేయడం లేదట. వెంకీ, రానా కోసం మరో శక్తిమంతమైన కథ రెడీ అవుతోందని, అందుకే అయ్యప్పనుమ్ కోషియుమ్ కోసం మరో హీరోని అన్వేషిస్తున్నారని టాక్.