‘ఎన్టీఆర్’ బయోపిక్ మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే బుక్ మై షో ల ద్వారా అడ్వాన్సు బుకింగులు జోరందుకున్నాయి. బుధవారం వీక్ డే. అయినా సరే… బుకింగులు అదిరిపోయాయి. దాదాపు 80 శాతం ఫుల్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ షో, సెకండ్ షోలు ఇప్పటికే ఫుల్స్ అవుతున్నాయి. ఉదయం 7 గంటల ఆటకు కొన్ని చోట్ల బుకింగులు తెరిచారు. ఆ టికెట్లుకూడా జోరుగా తెగాయి.కాకపోతే… మళ్లీ ఆ షో క్యాన్సిల్ అయ్యింది. తెలంగాణలో తొలి షో పడేది 8.45 నిమిషాలకే.
ఇటీవలే తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. ఇక్కడ టీడీపీ పార్టీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. మహా కూటమిలో భాగస్వామి అయిన టీడీపీకి ఎక్కడా ఆదరణ దక్కలేదు. అత్యంత కీలకమైన కూకట్ పల్లిలోనూ ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ బయోపిక్‌పై ఉంటుందేమో అని చిత్రబృందం కాస్త అనుమానించింది. ఈ సినిమాపై `టీడీపీ` ముద్ర బలంగా ఉండడంతో… నందమూరి అభిమానులు కూడా ఈ విషయంలో కాస్త భయపడ్డారు. కానీ.. బుకింగ్స్ జోరుగా ఉండడం, హైదరాబాద్ లోని అన్ని మల్టీప్లెక్స్‌లూ దాదాపు ఫుల్స్ అవుతుండడంతో.. చిత్రబృందం సంతోషంగా ఉంది. మహేష్ బాబు మల్టీప్లెక్స్‌లో ఎన్టీఆర్ టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇవన్నీ ఎన్టీఆర్‌కి శుభసూచికాలే.