హిందూపురంలో ఎమ్మెల్యే తరపున ప్రజల బాధలు తీర్చమని తన పీఏగా బాలకృష్ణ పెట్టుకున్న వ్యక్తి అక్కడ వైసీపీ నేతలతో కలిసి పేకాట ఆడుతూ జల్సా చేస్తున్నారు. ఎవరూ పట్టుకోరని అనుకున్నారో..లేకపోతే మరింత సేఫ్ జోన్ అనో కానీ.. ఆంధ్ర–కర్ణాటక సరిహద్దు లోని నగరిగేర వద్ద డెన్ ఏర్పాటు చేసుకుని పేకాట ఆడుతున్నారు. విషయం తెలిసి కర్ణాటక పోలీసులు దాడులు చేశారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పి ఎ బాలాజీ తో పాటు అధికార పార్టీకి చెందిన హిందూపూర్ మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ శ్రీ రామ్ రెడ్డి తో పాటు 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితులను కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ జిల్లా గుడిబండ కోర్టులో హాజరుపరిచారు. బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన తరపున పీఏలే ఎక్కువ పనులు చక్క బెడుతూ ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన పీఏలు చేసిన వ్యవహారాలతో బాలకృష్ణ ఇబ్బంది పడ్డారు. తర్వాత పీఏలను మార్చుకున్నారు. ఇప్పుడు పీఏగా ఉన్న బాలాజీ ఏకంగా వైసీపీ నేతలతో కలిసి పేకాట ఆడుకుంటున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
బాలకృష్ణ షూటింగ్లతో బిజీగా ఉంటున్నారని.. ప్రజల బాధల్ని చూడమని పెట్టిన పీఏలుకూడా అడ్డదోవ తొక్కుతున్నారని టీడీపీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల మూడ్ వస్తున్న సమయంలో ఇలాంటి పీఏల్ని పెట్టుకుని బాలకృష్ణ.. ఎన్నికలను ఎలా ఈదుతారోనన్న చర్చసహజంగానే జరుగుతుంది.