నందమూరి బాలకృష్ణ… ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడతారో అంచనా వేయడం చాలా కష్టం. ఆయన ఏ విషయంలోంచి, ఏ విషయంలోకైనా ‘జంప్’ అయిపోతారు. కొన్నిసార్లు ఆయన మాటలు భలే సరదాగా అనిపిస్తాయి. రేపు బాలకృష్ణ 60వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా టీవీ ఛానళ్లకు ఆయన వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ పూరిపై పంచ్ వేశారు.
మీ అబ్బాయి మోక్షజ్ఞ తొలి సినిమా.. పూరితోనా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు బాలయ్య వెంటనే స్పందిస్తూ..
పూరీనా.. ఇడ్లీ, ఉప్మాలు లేవా? అంటూ కౌంటరేశారు.
పూరితో బాలయ్యకు మంచి అనుబంధం ఉంది. ఇద్దరి కాంబోలో పైసా వసూల్ సినిమా వచ్చింది. త్వరలోనే బాలయ్యతో మళ్లీ పని చేస్తానని పూరి ఈమధ్యే చెప్పారు. మోక్షజ్ఞ డెబ్యూ సినిమా పూరి భుజాలపై పడిందని వార్తలొచ్చాయి కూడా. వీటిపై ఇప్పుడు ఇలా స్పందించాల్సివచ్చింది బాలయ్య.
“మోక్షజ్ఞ ఎంట్రీ భారీగా ఉంటుంది. అద్భుతమైన కథలు రెడీ చేసి పెట్టాం. చూస్తారుగా“ అంటూ మోక్షజ్ఙ ఎంట్రీపై మరిన్ని ఆశలు, అంచనాలు రేకెత్తించారు బాలయ్య.