నందమూరి బాలకృష్ణ వందో సినిమా కోసం పోటీ పడిన కథల్లో… ‘రైతు’ కూడా ఉంది. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం బాలకృష్ణ విన్న కథ ఇది. వందో సినిమా కోసం కథల వేటలో ఉన్నప్పుడు అప్పుడెప్పుడో విన్న ‘రైతు’ గుర్తొచ్చి… ఆ కథకుడ్ని పిలిపించి, సినిమాకి కృష్ణవంశీ చేతుల్లో పెట్టాడు బాలయ్య. అయితే అనూహ్యంగా బాలయ్య గౌతమి పుత్ర శాతకర్ణి వైపు టర్న్ అయ్యాడు. రైతు కథ పక్కకు పోయింది. అయితే ఆ కథపై మమకారం తగ్గని బాలయ్య దాన్ని 101వ సినిమాగా చేద్దామని ఫిక్సయిపోయాడు. అందుకు సంబంధించిన కసరత్తులు కూడా మొదలైపోయాయి. ఈ సినిమాలో బిగ్ బీ నటించడానికి ముందుకు రావడంతో ఈ ప్రాజెక్టుకి కొత్త కళ వచ్చింది.
రైతుకు సంబంధించిన సరికొత్త అప్ డేట్ ఏమిటంటే…. ఇప్పుడు ఈ కథలో మార్పులూ, చేర్పులూ మొదలయ్యాయని సమాచారం. దానికి కారణం కూడా బిగ్ బీనే. అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో రాష్ట్రపతిగా కనిపించనున్నారు. కథలో ఆయన పాత్ర కీలకమే అయినా… కనిపించేది అప్పుడప్పుడు మాత్రమే. కానీ.. బిగ్ బీ ఇంపాక్ట్‌ని బలంగా వాడుకోవాలని భావిస్తున్న కృష్ణవంశీ అండ్ టీమ్.. ఇప్పుడు ఆ పాత్ర స్వరూప స్వభావాల్లో మార్పులు చేయాలని భావిస్తోంది. అందుకు బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రైతు కథ స్వరూపం మారబోతోంది. గౌతమి పుత్ర శాతకర్ణి హంగామా డిసెంబరుతో పూర్తవుతుంది. ఈలోగా ఓ మంచి ముహూర్తం కుదిరితే రైతు సినిమాని లాంఛనంగా ప్రారంభించాలనుకొంటున్నారు. రెగ్యులర్ షూటింగ్ మాత్రం 2017లోనే.