ఖైదీ నెం. 150 రిలీజ్ డేట్ జనవరి 11 అని ఎప్పుడు ఫిక్స్ అయ్యిందో… అప్పుడే బాలకృష్ణ సినిమా గౌతమి పుత్ర రిలీజ్ డేట్ కూడా ముందుకు రావొచ్చన్న ఊహాగానాలు వినిపించాయి. ఈ విషయంపై బాలయ్య అభిమానులు క్రిష్‌పై ఒత్తిడి తీసుకురావడం, నిర్మాతలు కూడా ‘రిలీజ్‌డేట్ మారుద్దామా’ అనే మీమాంశలో పడడం అందరికీ తెలిసిన విషయమే. కానీ క్రిష్ మాత్రం 12నే వస్తున్నాం.. అంటూ బల్లగుద్ది మరీ చెప్పాడు. అయితే ఈ విషయంలో బాలయ్యఫ్యాన్స్ కాస్త నిరాశకు లోనైన మాట వాస్తవం. చిరుతో పోటాపోటీగా ఒకేరోజున రెండు సినిమాలూ విడుదల అయితే బాగుంటుందన్నది వాళ్ల ఉద్దేశం. ఈ విషయాన్ని స్వయంగా బాలయ్య దగ్గరకే తీసుకెళ్లారు అభిమానులు. బాలయ్యకు అత్యంత సన్నిహితంగా, వాళ్లింటి సభ్యుడిగా వ్యవహరించే ఒకరిద్దరు అభిమానులు 11నే విడుదల చేస్తే బాగుంటుందన్నది అభిమానుల మాటగా బాలయ్య దగ్గర చెప్పారని టాక్.
అభిమానుల నిర్ణయాన్ని గౌరవించే బాలయ్య.. కచ్చితంగా రిలీజ్ డేట్ విషయంలో ఓ నిర్ణయం తీసుకొంటారని, 11నే వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భావించారు. కానీ బాలయ్య మాత్రం విడుదల తేదీ మార్చమని అటు క్రిష్‌ని గానీ, ఇటు నిర్మాతల్ని గానీ అడగలేదట. ‘ముందు అనుకొన్నది 12నే కదా.. అప్పుడే విడుదల చేద్దాం.’ అంటూ హుందాగా అభిమానులకు సర్ది చెప్పాడట. దాంతో క్రిష్ తెగ సంబరపడిపోతున్నాడు. బాలయ్య మా నిర్ణయాన్ని గౌరవించారు.. అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు క్రిష్. ఒకవేళ బాలయ్య రిలీజ్ డేట్ మర్చమని అడిగితే.. క్రిష్ మీమాంశలో పడిపోదును. బాలయ్య నిర్ణయాన్ని కాదనలేడు.. అలాగని రిలీజ్ డేట్ మార్చలేడు. ఈ ఇబ్బందిని గమనించిన బాలయ్య.. దర్శక నిర్మాతలపై ఎలాంటి ఒత్తిడీ తీసుకురాలేదని, వాళ్ల నిర్ణయాన్ని గౌరవించాడని, ఇది బాలయ్య గొప్పదనమని అభిమానులు కూడా మురిసిపోతున్నారు. బాలయ్య అంటే.. అంతే కదా?