నందమూరి బాలకృష్ణ… ఆయన వెనుక వంద సినిమాల ‘చరిత్ర’ ఉంది. అగ్ర కథానాయకుడిగా ఉంటూ… ప్రయోగాలు చేయడం ఆయనకే చెల్లింది. సాంఘికం, పౌరాణికం, జానపదం, ఫాంటసీ, చరిత్ర… ఇలా అన్నిరకాల కథలకూ న్యాయం చేయగలగల ఏకైక కథానాయకుడు బాలకృష్ణ అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. తాజాగా గౌతమిపుత్ర శాతకర్ణితో మరోసారి అభిమానుల మనసుల్ని గెలుచుకొన్నారు. ఇలాంటి సినిమా చేయాలంటే బాలయ్యే చెయ్యాలి… అనిపించుకొన్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై.. విజయఢంకా మోగిస్తోంది. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణతో తెలుగు 360 చిట్ చాట్!
* వంద అంటే పరిపూర్ణం అని అర్థం… మీ వందో చిత్రం పరిపూర్ణమైన సంతృప్తిని అందించనట్టుంది..?
– అవునండీ! అన్ని రకాలుగానూ సంతృప్తినిచ్చిన చిత్రమిది. తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చింది. తెలుగువాళ్లే కాదు… భారతీయులంతా చూడదగిన సినిమా ఇది అంటున్నారంతా. ఈ చిత్రాన్ని ఓన్ చేసుకొన్నవాళ్లే ఎక్కువమంది కనిపిస్తున్నారు. చాలాకాలంగా సినిమాలు చూడనివాళ్లు కూడా గౌతమిపుత్ర శాతకర్ణిని చూడ్డానికి థియేటర్లకు వస్తున్నారంటే ఆశ్చర్యం… ఆనందం కలుగుతున్నాయి.
* ఇంతటి విజయాన్ని ముందే ఊహించారా?
– ఊహించా. ఎందుకంటే కథ అలాంటిది. నిజానికి ఈ సినిమాలో కథేం లేదు. క్రిష్ నాకు కథ చెప్పేటప్పుడు కట్టె కొట్టె తెచ్చె అన్నట్టు చెప్పాడు. కానీ తన విజన్ నాకు అర్థమైంది. అనుకొన్నది అనుకొన్నట్టు తీస్తే.. తప్పకుండా మంచి చిత్రం అవుతుందనిపించింది. అదే నిజమైంది.
* ఇన్ని యుద్దాలు, ఇంత హంగామా పెట్టుకొని ఇంత తక్కువ టైమ్‌లో క్రిష్ ఈ సినిమా పూర్తి చేయగలడా అనే సందేహాలు రాలేదా?
– క్రిష్ విజన్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ సినిమాని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడో ముందే చెప్పాడు. సినిమా నిడివి ఇంత ఉంటుంది…అని తొలి సిట్టింగ్‌లోనే చెప్పాడంటే క్రిష్ విజన్‌ని అర్థం చేసుకోవొచ్చు. నాకు ఎక్కడెక్కడ డౌట్లు వస్తాయో ముందే ఊహించి, దానికి తగిన సమాధానాలు సిద్ధం చేసుకొని మరీ వచ్చాడు. సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేస్తా అని తొలి రోజే చెప్పాడు. అనుకొన్నట్టే పూర్తి చేయగలిగాం.
* క్రిష్ ఇది వరకు తీసిన సినిమాల్ని చూశారా?
– కంచె చూశా. చాలా బాగుంది. అయితే అప్పటికి క్రిష్‌తో సినిమా చేయాలన్న ఆలోచన రాలేదు.
* ఈ సంక్రాంతికి సినిమాల మధ్య పోటీ ఎక్కువగా కనిపించింది..
– పోటీ ఉండాలి కదా? ఉంటేనే మంచిది. స్పర్థే వర్థతి విద్య అన్నారు. పోటీ ఉన్నప్పుడే కళ కూడా రాణిస్తుంది.
* మీరు మిగిలిన హీరోలతో ఎలా ఉంటారు?
– అందరితోనూ సరదాగానే ఉంటా. అయితే కలసుకొనే అవకాశం ఎప్పుడో గానీ రాదు. ఎందుకంటే నాకు చేతినిండా పనులు. ఏ పనీ లేదంటే సినిమా గురించి ఆలోచిస్తా. నేను కాస్త ఎక్కువగా టచ్‌లో ఉన్నది చిరంజీవిగారితోనే. ఆయన సినిమా కూడా ఈ సంక్రాంతికి వచ్చింది.
* మల్టీస్టారర్ చేస్తే ఏ హీరోతో చేస్తారు?
– మల్టీస్టారర్ చేయాలన్న ఆలోచన ఉంది. అయితే ఏ హీరో అన్నది చెప్పలేను. చేస్తే పౌరాణిక చిత్రమే చేస్తా.
* మీ ఇంట్లో మీ సినిమాల గురించి డిస్కర్షన్స్ నడుస్తుంటాయా? ఇది నచ్చింది.. ఇది నచ్చలేదు అని మాట్లాడుకొంటారా?
– ఓ… నిర్మొహమాటంగా చెప్పేస్తారు. వాళ్లందరికీ గౌతమిపుత్ర బాగా నచ్చింది. అందులో ఎవ్వరూ ఒక్క తప్పు కూడా పట్టుకోలేదు. క్రిష్ కూడా అంత బాగా తీశాడు.
* సినిమాల్ని ఏ ప్రాతిపదికపై ఒప్పుకొంటారు..? మీకు నచ్చాల్సింది కథ, లేదంటే మీ పాత్ర?
– అన్నీని. ఒక్కోసారి సింగిల్ లైన్‌తో కథ ఓకే అయిపోతుంది. లైన్ చుట్టూ కథ అల్లుకోవాల్సి వస్తుంది. పెద్దన్నయ్యకు అలానే చేశాం. ఒక్కోసారి హీరో పాత్ర చుట్టూ కథ నడుస్తుంది. ఏ సినిమా అయినా జనరంజకంగా తీర్చిదిద్దడం ముఖ్యం.
* దంగల్‌లాంటి సినిమాలు చేసే ఉద్దేశం ఉందా?
– కొన్ని కొన్ని కథలు నాకు సూట్ అవ్వవు. నేను రొమాన్స్ చేస్తే నా అభిమానులు చూడరు. అలానే సిక్స్‌ప్యాక్‌లు మన సంస్క్రృతి కాదు.
* మోక్షజ్ఞ కూడా మీలా యాక్షన్ చిత్రాలే చేస్తాడా?
– నటుడన్నాక అన్నీ చేయాలి. తాను దేనికి సూట్ అవుతాడో ఇప్పుడే చెప్పలేను. కనీసం ఒక్క సినిమా అయినా చేయాలి కదా?
* తనకు ట్రైనింగ్ ఇస్తున్నారా?
– ట్రైనింగ్ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఇవ్వను. ఇద్దరం కలసి సినిమాలు చూస్తుంటాం. అప్పుడే ఏ సీన్ ఎలా చేయాలి? ఈ సీన్ ఇలా ఎందుకు చేశాం అనేది మాట్లాడుకొంటాం.
* మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం కుదిరిందా?
– నేనేం ప్లాన్ ప్రకారం చేయను. ఎప్పుడు ఏది అనిపిస్తే అది చేస్తా. వేడి వేడిగా వడ్డించడమే నాకు ఇష్టం. నాకు మూడ్ వస్తే.. `రారా కెమెరా ముందు నిలబడు` అని చెప్పేస్తా. సినిమా మొదలెట్టేస్తా.
* దర్శకత్వం ఎప్పుడు?
– చేయాలనే ఉంది. నా దగ్గరకు దర్శకులు కథలు పట్టుకొని వస్తే.. నేను కొన్ని సూచనలు చేస్తుంటా. ఇలాంటి కథలు తయారు చేయండి అని చెబుతుంటా. వాళ్లు స్టోరీ రెడీ చేస్తారు. ఒకవేళ నేను చెప్పిన కథని ఎవ్వరూ డీల్ చేయలేరు అనుకొంటే.. అప్పుడు నేనే దర్శకత్వం వహిస్తా.
* 101వ సినిమా ఎప్పుడు? ఎవరితో?
– ఇంకా ఏం అనుకోలేదండీ.. ప్రస్తుతం గౌతమిపుత్ర విజయానందంలో ఉన్నాను.