ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ధర్మ పోరాట దీక్షలో ఆయన మాట్లాడారు. విభజన హామీల సాధన పోరాటంలో ఇక మిగిలింది దండోపాయం మాత్రమేననీ, సామ దాన భేద మార్గాలు అయిపోయాయన్నారు. భారత రాజ్యాంగంతోపాటు తన భార్యను కూడా ప్రధాని గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. భాజపాకి అధికార భిక్ష పెట్టింది ఎన్టీఆర్, చంద్రబాబులే అన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తే తెలుగువారు సహించరనీ, పిరికివారు కాదనీ, ఇక యుద్ధం మొదలైందని బాలయ్య ఆవేశపూరితంగా చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఒక్కో తెలుగువాడూ ఒక్కో విప్లవ యోధుడిగా మారాలని పిలుపునిచ్చారు.
ప్రధానిని ఉద్దేశించి హిందీలో మాట్లాడుతూ… ‘నువ్వు ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ దాక్కున్నా భారతమాత నిన్ను క్షమించదు. సమాధి చేసేస్తుంది. ప్రజల దగ్గరకు వెళ్తే తరిమి తరిమి కొడతారు. పోరాటం మొదలైంది, మేం మౌనంగా ఇక కూర్చోమ’ని బాలయ్య అన్నారు. ఆంధ్రాలో ఒక్క సీటు కూడా భాజపా గెలవలేదన్నారు. ప్రధాని ఉత్తర, దక్షిణ భారతాల మధ్య విభేదాలు స్రుష్టిస్తున్నారని ఆరోపించారు. వైకాపా ఎంపీల రాజీనామాలను ఊటంకిస్తూ… వారు చేస్తున్న దీక్షలూ, వారి వెనకాల ఎన్ని ప్యాకేజీలు ఉన్నాయో, వాళ్ల మధ్య ఎంత అవగాహన ఉందో ప్రజలందరికీ తెలుసన్నారు. వాళ్లను అడ్డం పెట్టుకుని శిఖండిలాగ, ఒక కొజ్జాలా మోడీ రాజకీయాలు చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వాళ్లకీ వీళ్లకీ సీట్లు రావని బాలయ్య అన్నారు.
ప్రధానిని ఉద్దేశించి బాలయ్య చేసిన వ్యాఖ్యలపై భాజపా నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ ఏపీ భాజపా అధికార ప్రతినిధి విల్సన్ డిమాండ్ చేశారు. బాలయ్య నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలనీ, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఇదే అంశమై భాజపా నేత విష్ణుకుమార్ రాజు కూడా స్పందించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తాము గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. బాలయ్య మాటలతో ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. మొత్తానికి, ప్రధానిని ఉద్దేశించి మాట్లాడే క్రమంలో బాలయ్య ఉపయోగించిన పదజాలం కొంత వివాదాస్పదం అయ్యేట్టుగానే ఉంది.