నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఓ క్లాసిక్…. ఆదిత్య 369. హాలీవుడ్ స్థాయి కథ కథనాలతో ఇంటిల్లిపాదినీ ఆకట్టుకొన్న సినిమా అది. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అద్భుత సృష్టికి… తార్కాణంగా నిలిచింది. ఆదిత్య 369కి సీక్వెల్ చేయాలన్న ఆలోచన బాలయ్యకు ఎప్పటి నుంచో ఉంది. ఆమధ్య సింగీతం కూడా ఇందుకు సంబంధించి ఓ స్క్రిప్టు తయారు చేశారు. బాలయ్య వందో సినిమాగా ఆదిత్య 999 ప్రస్తావన కూడా వచ్చింది. కానీ అదెందుకో కార్యరూపం దాల్చలేదు. అయితే ఆ సినిమా ఎప్పటికైనా తప్పకుండా చేస్తానని ప్రకటించేశారు బాలకృష్ణ. ఈ రోజు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ.. ఆదిత్య 999 ప్రస్తావన తీసుకొచ్చారాయన.
”ఆ కథ నాకు చాలా ఇష్టం. 999 స్క్రిప్టు రాసుకోలేదు గానీ… ఎలా ఉంటే బాగుంటుంది అనే అవగాహన మాత్రం బుర్రలో ఉంది. ఇక స్క్రిప్టు రాయడం ఎంత పని?? మోక్షజ్ఞ నేనూ కలసి నటిస్తాం. మేమిద్దం కలసి నటించే మొదటి, ఆఖరి సినిమా అదే అవుతుందేమో. ఎందుకంటే అన్ని కథల్లోనూ మేం కనిపించలేం కదా? మా ఇద్దరికీ బాగా నప్పుతుంది” అంటూ మనసులోని మాట బయటపెట్టారు. అయితే దర్శకత్వ బాధ్యత సింగీతానికి అప్పగిస్తారా, లేదంటే మరొకరి చేతిలో పెడతారా అనేది ఇంకా తెలియరాలేదు. మోక్షజ్ఞ ఎంట్రీ ఈ యేడాదే ఉండబోతోందని క్లారిటీగా చెప్పేశాడు బాలయ్య. మోక్షజ్ఞ ప్రస్తుతం తర్పీదు తీసుకొంటున్నాడని, ఈ యేడాది లాంచ్ చేయడం ఖాయమని బాలయ్య చెప్పేశాడు. బహుశా…. మోక్షజ్ఞ అరంగేట్ర చిత్రం ఆదిత్య 999నే కావొచ్చు.