మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఇదో మల్టీస్టారర్ అని, ఇందులో మరో హీరోకీ ఛాన్స్ ఉందని తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు రాజమౌళి బృందం ఆ హీరో కోసం అన్వేషణ మొదలెట్టింది. రాజమౌళి చూపు ఇప్పుడు బాలకృష్ణ వైపు పడిందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. బాలయ్యతో ఓ సినిమా చేయాలని రాజమౌళి ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. సింహాద్రి కథ బాలయ్య కోసం తయారు చేసుకున్నదే. ఇటీవల `అన్ స్టాపబుల్`లో కూడా `నాతో సినిమా ఎప్పుడు చేస్తావ్` అని బాలయ్య రాజమౌళిని అడిగేశాడు. ఇప్పుడు బాలయ్యకు తగిన పాత్ర దొరికేసింది.
మహేష్ సినిమాలో కథ ప్రకారం ఓ కీలకమైన పాత్ర ఉంది. హీరోతో సమానమైన పాత్ర అది. 40 నిమిషాల ఎపిసోడ్ లో ఓ స్టార్ కనిపించాలి. ఆ పాత్ర బాలయ్యతో చేయిస్తే ఎలా ఉంటుందన్నది రాజమౌళి ఆలోచన. అయితే ప్రస్తుతానికి ఇది ప్రాధమికంగా వచ్చిన ఆలోచనే. ఎందుకంటే మహేష్ తో సినిమాకి ఇంకా సమయం ఉంది. ఈ యేడాది చివర్లో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. కాబట్టి.. ఆలోగా కథలో మార్పులూ చేర్పులూ ఆటోమెటిగ్గా వస్తాయి. `నా సినిమాలో నటిస్తారా` అంటూ రాజమౌళి ఆఫర్ ఇస్తే, ఏ హీరో దాన్ని రిజెక్ట్ చేసే పరిస్థితి లేదు. రాజమౌళి కనుక `ఈ పాత్రకు బాలయ్యే ఫిక్స్` అని చివరి వరకూ అనుకుంటే మాత్రం మహేష్ – బాలయ్య కాంబోని తెరపై చూసేయొచ్చు.