బాలకృష్ణ భోళా శంకరుడు. మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. ఆలోచించి, మాటల్ని చక్కగా పేర్చి మాట్లాడడం బాలయ్య డిక్షనరీలో లేదు. దీనివల్ల కొన్నిసార్లు ఆయన మాటల్లో అపశ్రుతులు దొర్లడం… కొందరితో మాటలు పడడం విషయాలే. కానీ, బాలకృష్ణ ఎంత భోళా శంకరుడు అనేది ‘జై సింహా’ సక్సెస్ మీట్ చూస్తే తెలుస్తుంది. ‘నరసింహ నాయుడు’ షూటింగ్ టైంలో వేషాల కోసం ఎవరో ఆఫీసుకి వస్తే బాలకృష్ణ కంటే ఎక్కువ ఎత్తు ఉన్నారని చెప్పి బాడీ బిల్డర్స్ ని దర్శకుడు వెనక్కి పంపేద్దామని అనుకున్నారట. హీరోకి ఈ విషయం తెలిసి ‘కళామతల్లి’ని నమ్ముకుని వచ్చిన వాళ్లను పంపొద్దని చెప్పారట. ‘జై సింహ’ సక్సెస్ మీట్లో ‘నరసింహ నాయుడు’ టాపిక్ ఎందుకు వచ్చిందంటే? ఇందులో విలన్ వేషం వేసిన ప్రభాకర్ (కాలకేయ ఫేమ్) బాలకృష్ణ కంటే ఎత్తు. నయనతార భర్తగా నటించిన కరతార్ సింగ్ కూడా బాలకృష్ణ కంటే ఎత్తే. ఈ విషయాలు చెబుతూ “నా స్నేహితులుగా నటించిన విజయ్ కూడా పొడవే. అందరి పొడవాటి వ్యక్తుల మధ్య ఓ పొట్టోడిని నేను. సినిమాల్లో పాత్రలు ముఖ్యమంతే. మిగతా వాటిని పట్టించుకోకూడదు” అన్నారు బాలకృష్ణ. ఈ మాటలు చెప్పడానికి ఎంత గట్స్ ఉండాలి? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఎన్టీఆర్ కుమారుడు, తెలుగు స్టార్ హీరోల్లో ఒకరు, ఎమ్మెల్యే అయ్యుండి ‘నా సినిమాలోని సహా నటులతో పోలిస్తే నేను పొట్టి’ అని ఒప్పుకోవడం గ్రేట్.