ఓ తండ్రి పాత్రని కొడుకు పోషించడం, నిర్మించడం, ఒకేసారి రెండు సినిమాల్ని తెరకెక్కించడం ఇవన్నీ నందమూరి బాలకృష్ణకే సాధ్యమయ్యాయి. `ఎన్టీఆర్`లో కథానాయకుడూ ఆయనే, మహా నాయకుడూ ఆయనే. మరోవైపు నిర్మాతగా బాధ్యతల్ని మోశారు. `ఎన్టీఆర్` ఆడియో వేడుకలోనూ ఆయనదే హంగామా. అతిథిని వేదికపై ఆహ్వానించడం, వాళ్లు మాట్లాడే వరకూ ఓపిగ్గా పక్కనే నిలబడడం.. అందరినీ ఆకర్షించాయి. బాలయ్య స్పీచు కూడా… ఎప్పటిలా.. అటు నుంచి ఇటు ఇటు నుంచి అటూ జంప్ అవుతూ సాగినా.. `ఎన్టీఆర్` సినిమా తీయడంలోని ప్రధాన ఉద్దేశ్యం ఏమిటో.. అభిమానులకు చేరవేయగలిగారు. బాలయ్య ప్రసంగంలోని హైలెట్స్ ఇవీ…
* ఈ కార్యక్రమాన్ని నిమ్మకూరులో చేద్దామనుకున్నాం. వాతావరణం సహకరించకపోవడం వల్ల కుదర్లేదు. పైసా వసూల్ సమయంలో వర్షం వల్ల ఇబ్బంది పడ్డాం. ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండాలని హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టాం.
* ఇది సినిమా ప్రారంభోత్సవమా, పాటల వేడుకా? అనే అనుమానం మొదలైంది. నిన్నే ఈ సినిమా మొదలైనట్టు అనిపించింది. ఇంత త్వరగా పూర్తవ్వడం ఆశ్చర్యంగా ఉంది. నాకే నమ్మబుద్ది కావడం లేదు. అందులోనూ రెండు భాగాలు పూర్తి చేసుకున్నాం. రెండు భాగాల కోసం 89 రోజులు పనిచేశాం. ఎంతోమంది సిబ్బంది కలసి కష్టపడ్డాం. ఎవరూ కష్టంగా అనుకోలేదు.
* నందమూరి తారక రామారావు వారసుడిగా నేను రావడం పూర్వ జన్మసుకృతం. మనం సృష్టించేది చరిత్ర కాదు.. చరిత్రే మనల్ని సృష్టిస్తుంది అంటారు.కానీ అది అబద్దం.. గౌతమిపుత్ర శాతకర్ఱి.. ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.
* నాన్నగారు చేయని రెండు పాత్రలు నారదుడు, గౌతమిపుత్ర శాతకర్ణి చేశా అని గర్వంగా చెప్పుకునేవాడ్ని. ఆయన పాత్రే చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. మన సంకల్పం బలీయంగా ఉన్నప్పుడు పంచ భూతాలు కూడా తోడై ఆ కార్యాన్ని జరిపిస్తాయి. ముందు రెండు భాగాలు అనుకుని దిగలేదు.
* పౌరాణికాలంటే పిచ్చో,పైత్యమో అనుకోవొచ్చు. కానీ ఈ సినిమాలో ఏ పాత్ర ఎంత వరకో అన్నీ ఆలోచించి చేశాం. నేను ఆయన జీవిత సారాంశం తీసుకున్నానంతే. గాంధీ నుంచి మహానటి వరకూ వచ్చిన సినిమాల్ని శోధించి, పరిశోధించి ఈ సినిమా తీశా. యావత్ భారతదేశం గుర్తించుకోదగిన మనిషి. అందుకే ఈ సినిమాని అన్ని భాషల్లో విడుదల చేస్తాం. తెలుగువాడి దెబ్బేమిటో అందరికీ తెలియాలి.
* నా కోరికలన్నీ ఈ సినిమాతో నెరవేర్చుకున్నా. ఎన్టీఆర్ సినిమా వ్యాపారం కోసం చేయలేదు. ఓ మంచి సినిమా చేయాలి అనుకుని ఈ సినిమా చేశాం. రౌడీ ఇనస్సెప్టర్ సమయంలో సొంత బ్యానర్ పెట్టి సినిమా తీయాలని అనుకున్నా. కానీ ఇప్పటికి కుదిరింది. ఎన్టీఆర్ బయోపిక్ నేను తీయాలని రాసి పెట్టి ఉంది. ఈ సినిమా నందమూరి కుటుంబ సభ్యులందరి ఆమోదంతో, వాళ్ల సమ్మతి తీసుకుని చేశా. రామారావుగారిని బాలకృష్ణ ఆలోచనలో ఎలా చూపించాలో క్రిష్ చూపించారు.
* విద్యాబాలన్‌కి ఎన్నో అవార్డులువచ్చాయి. ఈ సినిమాలో మా అమ్మగారి పాత్రలో కనిపించారు. ఆ పాత్రకు ఆయన దొరకడం మా అదృష్టం. ఇది కేవలం అభిమానుల సినిమానే కాదు. ఆబాలగోపాలం.. సకుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా.