వెండి తెరపై బాలకృష్ణ డైలాగులు చెబుతుంటే.. చెవుల్ని థియేటర్ కి అంకితం చేసేయాలి. గుడ్లప్పగించి చూసేయాల్సిందే. ఆయన డైలాగులు ఆ రేంజులో ఉంటాయ్. సినిమాల్లో డైలాగులు చెప్పాలంటే బాలకృష్ణే చెప్పాలి… అని అభిమానులు కూడా గర్వంగా చెప్పుకుంటారు. కానీ… బయట, వేదికలపై బాలయ్య మాట్లాడితే అది కాస్త నవ్వులాటగా ఉంటుంది. పాయింట్ ఎక్కడో మొదలెట్టి, ఎక్కడికో వెళ్లి, తన పుట్టు పూర్వోత్తరాలు, వంశ ప్రతిష్ట. నాన్నగారు, రక్తం, అభిమానం.. అంటూ ఏదోదో మాట్లాడుతూ అసలు పాయింట్ మర్చిపోతారు. `వంద సినిమాలు చేసిన బాలయ్య మాట్లాడడం ఎప్పుడు నేర్చుకుంటాడో` అని ఆయన వీరాభిమానులు కూడా నొచ్చుకుంటుంటారు.
కానీ తెలుగు మహాసభల సందర్భంగా బాలయ్య ఇచ్చిన స్పీచ్ చూడండి. ది బెస్ట్… బాలయ్య కెరీర్లో ఇంత గొప్పగా ఎప్పుడూ మాట్లాడి ఉండడు. తెలుగు భాష సౌందర్యం గురించి, తెలుగు కవుల గురించి, తెలుగు నేల గురించి మాట్లాడుతుంటే, దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎంతెంతమంది తెలుగువాళ్లు ఉన్నారో అంకెలతో సహా చెబుతుంటే సభా ప్రాంగణం మొత్తం ఆశ్చర్యపోయింది. కొమరం భీమ్.. బూరుగుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు, సురవరం, కాళోజీ, డా.సినారె, దాశరధి… ఇలా పేరు పేరున కవులను, పోరాట యోధుల్నీ గుర్తు చేసిన బాలయ్య తెలుగు భాష సొగసు గురించి అంతే గొప్పగా చెప్పాడు.
గోదావరి ఒంపులున్నాయి,
కృష్ణవేణి సొంసులున్నాయి,
నెల్లూరి నెరజాణ తనముంది
రాయలసీమ రాజసం ఉంది
కోనసీమ లేత కొబ్బరి నీరు తెలుగు భాష… అంటూ అసువుగా కవిత్వం చెప్పి మెప్పించాడు. బాలయ్య స్పీచు ఎప్పుడూ ఇంతే బాగా, ఇంత హుందాగా, ఇంత అద్భుతంగా ఉంటే ఎంత బాగుణ్ణో..! మొత్తానికి బాలయ్య తన స్పీచ్తో అదరగొట్టేశాడు. అభిమానుల్ని మెప్పించాడు.