నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. మేలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో బాలయ్య రెండు రకాలైన పాత్రలు పోషిస్తున్నాడన్న విషయం తెలిసిందే. అఘోరాగా బాలయ్య నటిస్తాడని ముందు నుంచీ చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు కథలోంచి ఆ పాత్ర `డిలీట్` అయ్యింది. అఘోరా ఎపిసోడ్ మొత్తం మార్చేసి, ఆ పాత్రకు కొత్త కలరింగు ఇచ్చాడు బోయపాటి.
ఇప్పుడు ఆ పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అంశం బయటకు వచ్చింది. ఈ పాత్రలో బాలయ్య విగ్గు లేకుండా నటించబోతున్నాడట. బయట ఎలా ఉంటాడో, అలానే వెండి తెరపై కనిపించబోతున్నట్టు టాక్. బాలయ్య వెండి తెరపై ఇలా కనిపించడం ఇదే తొలిసారి. సాధారణంగా బాలయ్యకి తగిన విగ్గు వెదికి పెట్టుకోవడం చాలా కష్టమైన సంగతి. కొన్ని సినిమాల్లో బాలయ్య విగ్గు సెట్ అయ్యేది కాదు. దానిపై అభిమానులూ గుర్రుగా ఉండేవారు. బోయపాటి మాత్రం తన సినిమాల్లో బాలయ్యని అందంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. `బిబి 3`లో బాలయ్య లుక్ కూడా అభిమానులకు నచ్చేసింది. అయితే విగ్గు లేకుండా వెండి తెరపై బాలయ్య ఎలా ఉంటాడన్నది ఆసక్తికరం. ఓ స్టార్ హీరో అయ్యుండి బాలయ్య ఈ సాహసానికి పూనుకోవడం నిజంగా అభినందించదగిన విషయం. ఈ ప్రయత్నం సక్సెస్ అయితే… బాలయ్య నుంచి ఇక ముందు కూడా ఇలాంటి ప్రయత్నాలు, ప్రయోగాలూ చూడొచ్చు.